పృథ్వీ షా (PC: BCCI)
భారత క్రికెటర్, మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా (Prithvi Shaw) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 23 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. పృథ్వీకి తోడు మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి భారీ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. ఫలితంగా మహారాష్ట్ర.. హైదరాబాద్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
దేశవాళీ టీ20 టోర్నరమెంట్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో భాగంగా ఎలైట్ గ్రూప్-‘బి’లో ఉన్న మహారాష్ట్ర- హైదరాబాద్ (Hyderabad vs Maharashtra) శుక్రవారం తలపడ్డాయి. కోల్‌కతా వేదికగా జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ స్టేడియంలో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
రాణించిన హైదరాబాద్ బ్యాటర్లు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (12), అమన్ రావు (11) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ ప్రజ్ఞయ్ రెడ్డి (17 బంతుల్లో 26), రాహుల్ బుద్ధి (31) ఓ మోస్తరుగా రాణించారు.
మిగిలి వారిలో భవేశ్ సేత్ (19) విఫలం కాగా.. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 32), కెప్టెన్ సీవీ మిలింద్ (20 బంతుల్లో 35 నాటౌట్), మొహ్మద్ అర్ఫాజ్ అహ్మద్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్ సక్సేనాకు రెండు, ఆర్‌ఎస్ హంగ్రేగ్కర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్ ఒక్కో వికెట్ తీశారు.
దుమ్ములేపిన ‘మహా’ ఓపెనర్లు
ఇక హైదరాబాద్ విధించిన 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ పృథ్వీ షా 23 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 36 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు.
మరోవైపు... అర్షిన్ కులకర్ణి సైతం ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని.. పన్నెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అజిమ్ కాజీ (8) విఫలం కాగా.. రాహుల్ త్రిపాఠి 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి అర్షిన్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఐపీఎల్ జట్లకు సందేశం!
కాగా సచిన్ టెండుల్కర్ స్థాయికి చేరుకుంటాడంటూ నీరాజనాలు అందుకున్న పృథ్వీ షా.. అనతికాలంలోనే టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు. దేశీ క్రికెట్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఫిట్‌నెస్ లేమి, క్రమశిక్షణా రాహిత్యం కారనంగా ఆటపై దృష్టి పెట్టలేకపోయిన పృథ్వీ షాను గతేడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.
ఫలితంగా పృథ్వీ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. తర్వాత సొంత జట్టు ముంబైని కూడా వీడి.. ఈ దేశీ సీజన్ ఆరంభంలోనే మహారాష్ట్రతో చేరాడు. తన తప్పుల్ని తెలుసుకుని ఆటపై దృష్టి సారించానన్న పృథ్వీ.. ఫార్మాట్లకు అతీతంగా అదరగొడుతున్నాడు. తాజా ప్రదర్శనతో ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలకు తానూ రేసులో ఉంటాననే సందేశం ఇచ్చాడు.


