ఆధార్ కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా లేదా పుట్టిన తేదీ రుజువుగా పరిగణించబోమని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. నకిలీ ధ్రువపత్రాల వినియోగాన్ని అరికట్టేందుకు, జనన, మరణాల నమోదు చట్టం (సవరణ) 2023కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.
ఉత్తరప్రదేశ్‌లో..
ఉత్తరప్రదేశ్‌లో ఆధార్ కార్డును పుట్టిన తేదీకి ఏకైక రుజువుగా అంగీకరించబోమని ప్రణాళిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘ఆధార్ కార్డుకు జనన ధ్రువీకరణ పత్రం జతఅవ్వదు. అందువల్ల దీన్ని బర్త్ సర్టిఫికేట్‌గా పరిగణించలేం’ అని ఆ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ అన్ని ప్రభుత్వ శాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
మహారాష్ట్రలో..
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. జనన ధ్రువీకరణ పత్రాల జారీలో ఆధార్ కార్డును కీలకంగా పరిగణించబోమని, జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం కేవలం ఆధార్ కార్డు ద్వారా జారీ చేసిన అన్ని జనన ధ్రువీకరణ పత్రాలను రద్దు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నకిలీ పత్రాలను చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిలిపివేయడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే ఆధార్ కార్డులను ఉపయోగించి జారీ చేసిన అన్ని అనుమానాస్పద సర్టిఫికెట్లను రద్దు చేయాలని ఆదేశించారు. అంతేకాక, ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.
అక్రమ వలసదారులపై కఠిన వైఖరి
మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించారు. శాంతిభద్రతలు, జాతీయ భద్రత తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు అని, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతి జిల్లా యంత్రాంగం తమ ప్రాంతంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేలా చూడాలని, నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రతి జిల్లాలో తాత్కాలిక నిర్బంధ కేంద్రాలను (డిటెన్షన్ సెంటర్లు) ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న అక్రమ వలసదారులను ఈ కేంద్రాల్లో ఉంచి తదుపరి వారి స్వస్థలాలకు పంపాలని తెలిపారు.
ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?


