న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆధార్ కొత్త మస్కట్‌ను ప్రారంభించింది. దీనికి యూడీఏఐ(ఉదయ్) అని పేరుపెట్టారు. ఆధార్ సేవలపై ప్రజలకు మరింత లోతుగా అవగాహన కల్పించడం, సేవలను వారికి చేరువ చేయడమే లక్ష్యంగా కొత్త మస్కట్‌ను ఆవిష్కరించినట్లు యూఐడీఏఐ గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది. మస్కట్ కోసం పోటీ నిర్వహించారు. ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో ఎంట్రీలను స్వీకరించారు. మొత్తం 875 ఎంట్రీలు వచ్చాయి. విద్యార్థులు, వృత్తి నిపుణులు, డిజైనర్లు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ పోటీలో కేరళలోని త్రిసూర్‌కు చెందిన అరుణ్ గోకుల్ విజేతగా నిలిచారు. ఆయన రూపొందించిన మస్కట్‌ను ఎంపిక చేశారు. అలాగే పేరును సూచించే పోటీలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన రియా జైన్ నెగ్గారు. ఈ కొత్త మస్కట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. యూఐడీఏఐ చైర్మన్ నీలకాంత్ మిశ్రా ఈ మస్కట్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ‘ఉదయ్’ను రూపొందించిన అరుణ్ గోకుల్, పేరు పెట్టిన రియా గోకుల్‌ను సత్కరించారు. యూఐడీఏఐ ప్రస్థానంలో మస్కట్ ఆవిష్కరణ ఒక ముందడుగు అని నీలకాంత్ మిశ్రా పేర్కొన్నారు. మస్కట్ నేమ్ కాంపిటీషన్‌లో హైదరాబాద్‌కు చెందిన మహారాజ్ శరణ్ చెల్లపిళ్ల మూడో స్థానంలో నిలిచారు.


