న్యూఢిల్లీ: ఆధార్ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చింది. ఆన్‌లైన్ సంస్థలు, సోషల్ మీడియా వేదికలు యూజర్ల వయసు నిర్ధారణ నిమిత్తం కూడా ఈ యాప్‌ను ఉపయోగించవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ బుధవారం తెలిపారు. తద్వారా పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఆన్‌లైన్ కంటెంట్ పిల్లలకు అందుబాటులో ఉండకుండా అవి జాగ్రత్త పడేందుకు వీలుంటుందని వివరించారు.
అంతేగాక హోటళ్లు, సినిమా హాళ్లు తదితరాల వద్ద ఆధార్‌ను డిజిటల్‌గానే వెరిఫై చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిందన్నారు. మొబైల్ నంబర్‌ను కూడా ఆధార్ కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండా ఈ యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. వ్యక్తిగత మొబైల్ నంబర్లు లేని పిల్లలు, వయోవృద్ధులైన తల్లిదండ్రులు... ఇలా గరిష్టంగా ఐదుగురి దాకా ప్రొఫైల్స్‌ను ఒక ఆధార్‌కు జత చేస్తూ యాప్‌లో నమోదు చేసుకోవచ్చని కూడా వివరించారు.


