మూడు రెట్లు ప్రొటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో షుగర్‌ను పెంచని వరి బియ్యం సిద్ధం
నూకలతో షుగర్ నిరోధక డిజైనర్ వరి బియ్యం ఉత్పత్తి సాంకేతికతను రూపొందించిన సీఎస్‌ఐఆర్
జన్యుమార్పిడి అవసరం లేకుండా గోల్డెన్ రైస్ ఉత్పత్తి
రెండు సంస్థలకు సాంకేతికత బదిలీ.. త్వరలో మార్కెట్‌లోకి..
సాధారణ వరి బియ్యం కన్నా మూడు రెట్లు అధిక ప్రొటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన సరికొత్త డిజైనర్ వరి బియ్యం మన వంటగదిలోకి త్వరలోనే రానున్నాయి. పసుపు రంగులో ఉండే ఈ పోషక సంపన్న బియ్యం చూడ్డానికి, తినటానికి సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు. కేంద్ర శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్‌ఐఆర్)కు అనుబంధంగా తిరువనంతపురంలోని నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎస్‌టీ) శాస్త్రవేత్తలు ఈ డిజైనర్ రైస్‌ను ఉత్పత్తి చేసే సాంకేతికతను రూపొందించారు.
దేశంలో తెల్ల బియ్యం తినే కోట్లాది మందిని వేధిస్తున్న సూక్ష్మ పోషకాహార లోపాన్ని పరిష్కరించటం, షుగర్ ముప్పును తగ్గించే లక్ష్యంతో ఈ బియ్యాన్ని రూపొందించినట్లు ఎన్‌ఐఐఎస్‌టీ ప్రకటించింది. సాధారణ తెల్ల వరి బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ పెరుగుదలకు దోహదం చేస్తుంది.
డిజైనర్ బియ్యం అంటే?
వరి బియ్యం నూకను పిండి చేసి.. అందులో ఉండే పిండి పదార్థం, మాంసకృత్తులు, పీచును వేరుచేస్తారు. ఎక్కువ మోతాదులో ఉండి బ్లడ్ షుగర్ పెంచుతున్న పిండి పదార్ధాన్ని తగ్గించి, ప్రొటీన్లను మూడు రెట్లు పెంచేలా, సమతుల్యత పొందేలా బియ్యాన్ని తిరిగి తయారు చేస్తారు. ఇది జీవక్రియ సంబంధమైన అనారోగ్యానికి చురుకైన, నిర్మాణాత్మక పరిష్కారంగా పనిచేసే పోషక–సాంద్రత గల ఆహారమని చెబుతున్నారు. మన అభీష్టానికి అనుగుణమైన సుగుణాలతో రూపొందించింది కాబట్టి ‘డిజైనర్ బియ్యం’ అని పిలుస్తున్నారు.
పౌష్టికాహార లోపానికి చెక్
మన దేశం ఒక విలక్షణమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధిక గ్లైసెమిక్ సూచిక (జీఐ)తో కూడిన తెల్ల బియ్యంతో భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర ప్రమాదకరమైన వేగంతో పెరుగుతుంది. మరోవైపు, లక్షలాది మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. తగినన్ని కేలరీల అన్నం తిన్నప్పటికీ ప్రొటీన్, ఖనిజాల లోపం వస్తోంది.
డిజైనర్ రైస్ ప్రయోజనాలు
తక్కువ జీఐ (55 కంటే తక్కువ): శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు.
ప్రొటీన్ పవర్‌హౌస్: సాధారణ బియ్యంలో 6–8% ప్రొటీన్ ఉంటుంది. ఈ బియ్యంలో 20% కంటే ఎక్కువే ఉంటుంది.
బలవర్థకమైన రక్షణ: ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12ను కలిపి తయారు చేసిన బియ్యం కావటంతో రక్తహీనతను తగ్గిస్తుంది.
పిండి తగ్గించి ప్రొటీన్లు పెంచాం
డిజైనర్ బియ్యాన్ని ఒక ‘ఆహార భవన నిర్మాణం’గా భావించండి. ఉదాహరణకు.. సాధారణ బియ్యం లాంటి ఒక భవనం ఉందనుకోండి. ఇది ఎక్కువగా ‘చక్కెర ఇటుకల’ (పిండి పదార్థం)తో తయారైన ఇల్లు. ఎన్‌ఐఐఎస్‌టీ పరిశోధకుల బృందం ఆ ఇంటిలోని ఇటుకలన్నింటినీ విడదీశారు. ఆ ఇటుకల్లో ఎక్కువగా ఉన్న పిండి పదార్ధాన్ని చాలావరకు తొలగించి, ఆ ఖాళీని ప్రొటీన్ల ఇటుకలతో భర్తీ చేశారు. జన్యుమార్పిడి సాంకేతికతకు బదులు ఆహార శుద్ధి సాంకేతికతను ఉపయోగించి ఈ బియ్యాన్ని రూపొందించారు. తక్కువ ధరకు అమ్ముడయ్యే వరి నూకను మెత్తని పిండిగా చేసి.. అందులో పిండి పదార్ధాన్ని తీసేసి.. ఆ మేరకు ప్రొటీన్లు, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్–బీ12 వంటి సూక్ష్మపోషకాలను కలిపారు.
ఈ మిశ్రమాన్ని లేత పసుపు రంగులో ఉండే సన్న వరి బియ్యపు గింజలుగా తయారు చేశారు. మనకు తెలిసిన బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. రుచిగా, సంతృప్తికరంగా ఉండేలా డిజైనర్ బియ్యాన్ని తయారు చేశారు. అధిక ప్రొటీన్ ఉన్న కారణంగా ఈ బియ్యంతో వండిన అన్నం మామూలు అన్నం కంటే రుచిగా ఉంటుంది. నూకలకు విలువ పెరుగుతుంది కాబట్టి రైతులకూ ఉపయోగకరమే. –డాక్టర్ ఆనందరామకృష్ణన్, సీఎస్‌ఐఆర్–ఎన్‌ఐఐఎస్‌టీ డైరెక్టర్, డిజైనర్ రైస్ ప్రాజెక్ట్ రూపశిల్పి


