ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్)ను దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారుల బాధ్యత. అయితే, తెలియక చేసిన తప్పులు, ముఖ్యంగా విదేశీ ఆస్తుల వంటి కీలక వివరాలను వెల్లడించకపోవడం వంటి అంశాల్లో ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు (లేదా ఎస్‌ఎంఎస్/ఈ-మెయిల్స్) అందుకునే అవకాశం ఉంది. 2025–26 అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై)కి సంబంధించిన ఐటీఆర్‌ల్లో విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించని పన్నుదారులకు ఇలాంటి నోటీసులు పంపబోతున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.
ఐటీ డిపార్ట్‌మెంట్ అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ సమాచార మార్పిడి ఒప్పందాల (ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ - ఏఈఓఐ) ద్వారా పన్నుదారుల ఆర్థిక లావాదేవీల గురించి సులభంగా తెలుసుకోగలుగుతోంది. విదేశీ జ్యూరిస్‌డిక్షన్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా, విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండి కూడా ఐటీఆర్‌లో ఆ వివరాలను పేర్కొనని వారికి ఐటీ శాఖ ఎస్‌ఎంఎస్‌లు/ఈ-మెయిల్స్ పంపడానికి సిద్ధమైంది.
‘హై–రిస్క్’ కేసులు
తొలి దశలో భాగంగా దాదాపు 25,000 ‘హై–రిస్క్’ కేసులుగా పరిగణిస్తున్న వారికి త్వరలో ఎస్‌ఎంఎస్‌లు/ఈ–మెయిల్స్ పంపనున్నారు. చట్టపరమైన చర్యలను నివారించడానికి వీరు 2025 డిసెంబర్ 31లోగా సవరించిన ఐటీఆర్ (Revised ITR)ను దాఖలు చేయాలని సూచించారు. గత ఏడాది కూడా ఇలాగే నోటీసులు పంపినప్పుడు మొత్తం 24,678 మంది పన్నుదారులు రూ.29,208 కోట్ల విలువైన విదేశీ అసెట్స్ వివరాలను పొందుపరుస్తూ సవరించిన ఐటీఆర్‌లను దాఖలు చేశారు. ఇది పన్ను ఎగవేతదారులను గుర్తించే విషయంలో డిపార్ట్‌మెంట్ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.
ఐటీ శాఖ ఇప్పటికే జూన్ వరకు 1,080 కేసులను మదింపు చేసి రూ.40,000 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసులు పంపింది. ఢిల్లీ, ముంబై, పుణె వంటి నగరాల్లో సోదాలు కూడా నిర్వహించారు.
నోటీసులకు ఎలా స్పందించాలి?
ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ లేదా అధికారిక నోటీసు అందుకున్నప్పుడు పన్ను చెల్లింపుదారుడు భయాందోళనకు గురికాకుండా చట్టబద్ధంగా స్పందించాలి. నోటీసులు ఏ సెక్షన్ కింద వచ్చింది? (ఉదాహరణకు, సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయమని తెలిపే సమాచార మెయిల్ కావచ్చు, లేదా సెక్షన్ 143(2) కింద మదింపు నోటీసు కావచ్చు.) అనే వివరాలు తెలుసుకోవాలి. నోటీసు దేని గురించి.. ఆదాయం తక్కువగా చూపడం, ఖర్చులను ఎక్కువగా చూపడం లేదా విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం వంటివాటిలో ఏది? అనే దాన్ని పరిశీలించాలి. నోటీసుకు స్పందించడానికి నిర్దిష్టంగా ఇచ్చిన గడువును గుర్తించాలి.
సవరించిన ఐటీఆర్ దాఖలు
విదేశీ ఆస్తుల వెల్లడి విషయంలో డిపార్ట్‌మెంట్ స్నేహపూర్వకంగా సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయమంటూ ఎస్‌ఎంఎస్/ఈ-మెయిల్ పంపినట్లయితే అది చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి ఇచ్చిన ఒక అవకాశంగా భావించాలి. పన్ను చెల్లింపుదారు తక్షణమే తన ఐటీఆర్‌ను సమీక్షించి విదేశీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, మూలధన లాభాలు లేదా ఇతర విదేశీ ఆదాయాల వివరాలను తప్పనిసరిగా చేర్చి సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయాలి. సవరించిన రిటర్న్ ద్వారా అదనపు పన్ను చెల్లించాల్సి వస్తే ఆలస్య రుసుముతో సహా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. ఈ చర్య చట్టపరమైన చర్యలను (పెనాల్టీలు, ప్రాసిక్యూషన్ వంటివి) నివారించడానికి ఉపకరిస్తుంది.
చట్టపరమైన చిక్కుల నివారణ
సమయానికి స్పందించడం అనేది జరిమానాలు, ప్రాసిక్యూషన్ వంటి తీవ్ర పరిణామాలను నివారించడానికి దోహదం చేస్తుంది. నోటీసులో పేర్కొన్న గడువులోగా స్పందించడం అత్యంత ముఖ్యం. గడువు దాటితే డిపార్ట్‌మెంట్ ఏకపక్షంగా మదింపును పూర్తి చేసే అవకాశం ఉంది. నోటీసులు క్లిష్టంగా లేదా పెద్ద మొత్తాలకు సంబంధించినవైతే పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్‌ల (సీఏ) సహాయం తీసుకోవడం ఉత్తమం. వారు నోటీసును విశ్లేషించి చట్ట ప్రకారం సరైన స్పందనను సిద్ధం చేయడంలో సహాయపడతారు. ఐటీ డిపార్ట్‌మెంట్ విచారణలో పూర్తి సహకారం అందించాలి. అడిగిన అన్ని పత్రాలను, వివరాలను ఆలస్యం చేయకుండా సమర్పించాలి.
ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?


