Income Tax: కొత్త చట్టంలో జీతాల మీద ఆదాయం | Changes in Salary Taxation under the New Tax Law | Sakshi
Sakshi News home page

Income Tax: కొత్త చట్టంలో జీతాల మీద ఆదాయం

Jan 5 2026 8:08 AM | Updated on Jan 5 2026 8:43 AM

Changes in Salary Taxation under the New Tax Law

ముందుగా టాక్స్‌ కాలమ్‌ పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... అరవై ఏళ్లు దాటిన ఆదాయపన్ను చట్టంకు బదులుగా దాని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను 2025 వస్తోంది. పేరులో 2025 అని ఉన్నా అమలు మాత్రం 1.4.2026 నుంచి వస్తోంది. ఈ వారం జీతాలకు సంబంధించిన అంశాలు తెలుసుకుందాం.  

ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 31–3–2026తో ముగుస్తుంది. దీనికి, అంటే 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2026–27ని అస్సెట్‌మెంట్‌ ఇయర్‌ అంటారు. ఆర్థిక సంవత్సరం 2024–25 సంవత్సరం వరకు 1961 చట్టం వరిస్తుంది. 2024–25, అంతకుముందు ఆర్థిక సంవత్సరం వర్తించే 1961 చట్టంలో జీతం నిర్వచనం, దీని పరిధి, పలు అంశాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా, యజమాని తన ఉద్యోగికి ఇచ్చిన డబ్బుకి ఇవి వర్తిస్తాయి.

ఇక టాక్సబిలిటీ విషయాకొస్తే, చేతికొచ్చినా, రాకపోయినా హక్కుగా ఏర్పడ్డా, జీతం పన్ను పరిధిలోకి వస్తుంది. డిడక్షన్ల జోలికొస్తే సాండర్డ్‌ డిడక్షన్‌ను, వృత్తి పన్ను డిడక్షన్‌ చేస్తారు. పాత పద్ధతిలో అయితే ఛాప్టర్‌  VI ప్రకారం మినహాయింపులు ఇస్తారు. ఇవి చాలా ఉన్నాయి. కొత్త పద్ధతి ప్రకారం డిడక్షన్లు చాలా తక్కువ. పాత పద్దతి చూస్తే తక్కువ శ్లాబులు .. ఎక్కువ రేట్లు. కొత్త పద్ధతిలో బేసిక్‌ శ్లాబ్‌ ఎక్కువ. శ్లాబులు ఎక్కువ. రేట్లు చాలా తక్కువ.

ఇప్పుడు రాబోయే మార్పులు:  
🔸    చట్టం సులభరీతిలో ఉంది.  
🔸   నిర్వచనాలు, పన్ను పరిధి అంశాల్లో ఎటువంటి మార్పులేదు. 
🔸    ఇక నుంచి అకౌంటింగ్‌ ఇయర్, అస్సెస్‌మెంట్‌ సంవత్సరం అని ఉండదు. 
🔸    ఒకే ఒక పదం... దానిపేరే ఆదాయపు సంవత్సరం. కావున ఎటువంటి పొరబాటుకి తావులేదు. 
🔸    2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి మొత్తం నికర ఆదాయం .. అంటే టాక్సబుల్‌ ఇన్‌కం .. సంవత్సరానికి రూ.12,00,000 వరకు పన్ను పడదు. ఉద్యోగస్తులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75వేల వరకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు రూ.12,75,000ల వరకూ ఎటువంటి పన్ను పడదు. 
🔸    మీ ఆదాయం... నికర ఆదాయం రూ.12,00,00 లోపల ఉన్నట్లు అయితే ట్యాక్స్‌ పడదు. 
🔸    దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రణాళిక చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇంటి మీద హక్కులు జాయింట్‌గా ఉంటే, ఆ అద్దెని ఇద్దరికి అకౌంటులో సర్దుబాటు చేయడం. రెండవ ఉదాహరణగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ... ఒకరి పేరు మీదనే అన్ని డిపాజిట్లు ఉంచుకోకుండా ఇతర భాగస్వామి మీద బదిలీ చేయడం. అయితే ఈ రెండింట్లో ఏది చేసినా కాగితాలు ముఖ్యం. మరే, అగ్రిమెంట్లు రాసుకోకపోయినా ఓనర్‌షిప్‌.. టైటిల్‌ డీడ్స్‌లో ఇద్దరి పేరుండటం, అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఆయా వ్యక్తి పేరు మీద ఉండటం. 
🔸    రిబేటు రూపంలో బేసిక్‌ లిమిట్‌ రూ.12,00,000 పెంచినట్లే తప్ప, ఆదాయం రూపంలో కాదు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం.  
🔸    2025–26 ఆర్థిక సంవత్సరం కొత్త పద్ధతి ప్రకారం బేసిక్‌ లిమిట్‌... శ్లాబులు... రేట్లు మీకు సుపరిచితమే.  
🔸    అలాగే పాత పద్ధతిలో కూడా...

చివరిగా, ప్రాథమిక, మౌలిక విషయాల్లో మార్పు లేనప్పటికీ, విషయ విశదీకరణలో, సరళత్వం కన్పిస్తుంది. కొత్త పద్ధతిలో వెళ్లడానికి ప్రోత్సాహకరంగా ఉంది. అవే సర్కిళ్లు, అవే డివిజన్లు, అవే పద్ధతులు, అదే మదింపు పద్దతి విధానం, నోటీసులు, సమన్లు, జవాబులు, వడ్డీలు, పెనాల్టీలు, అధికార్ల అభిమతం, హక్కులు, అధికారాలు, బాధ్యతలు, విధివిధానాలు మారవు. అలాగే కొనసాగుతాయి. పాతసీసాలో కొత్త నీరు. పేరు మారితే పెత్తనం పోతుందా. భాషను మార్చినా, వేషము మార్చినా అధికార్లు అలాగే ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement