ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఈడీ అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అప్పీలుపై స్పందన కోరుతూ సోనియా, రాహుల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజెఎల్‌కు కాంగ్రెస్ పార్టీ రూ. 90కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈవ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, అస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దుబే తదితరులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది.
ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులు. ఈ సంస్థ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజేఎల్‌కు చెందిన సూమారు. రూ. రెండువేల కోట్ల విలువైన ఆస్తులు పొందారని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఇతర స్వాతంత్ర సమర యోధులు ప్రారంభించారు. దీని నిర్వహణ బాధ్యతలు AJL అనే సంస్థ చూసుకునేది. ఈ పత్రికకు ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. కాగా ఆస్తుల బదిలీ విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది.


