నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం | Ambati expresses his anguish before the judge | Sakshi
Sakshi News home page

నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం

Feb 2 2026 3:51 AM | Updated on Feb 2 2026 3:51 AM

Ambati expresses his anguish before the judge

జడ్జి ఎదుట అంబటి ఆవేదన  

పైనుంచి ఒత్తిడి ఉందంటూ పోలీసులు హింసించారు 

పట్టాభిపురం, నల్లపాడు సీఐల సమక్షంలో వేధింపులు.. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన జడ్జి

14 రోజుల రిమాండ్‌.. రాజమహేంద్రవరం జైలుకు తరలింపు

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌)/గుంటూరు లీగల్‌: తనను అంతం చేయడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీస్‌­స్టేషన్లో తనను హింసించారని తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. దీంతో శనివారం ఆయన్ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు గుంటూరు మొబైల్‌ కోర్టులో హాజరు పరిచారు.

రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్‌ కేసులు ఉన్నా­యని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అంబటి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై అంబటి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంబటిపై నమోదైన కేసు ఎఫ్‌ఐఆర్‌ చెల్లదన్నారు. 

ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి ఉందని, దీన్ని పోలీసులు పట్టించుకోలే­దన్నారు. అంబటిపై పెట్టిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే కాబట్టి 41ఏ నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం తగదన్నారు.  

రెండు కాళ్లు పంగ చీల్చి వేధించారు
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తనను హింసించిన తీరును న్యాయమూర్తి ఎదుట వివరించారు. ‘గుంటూరు సిద్ధార్థనగర్‌లోని మా ఇంటి వద్ద నుంచి శనివారం రాత్రి 10.30 గంటలకు పోలీసులు నన్ను నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. లాకప్‌లో పడుకుని ఉండగా, రాత్రి రెండు గంటలప్పుడు ఒక కానిస్టేబుల్‌ వచ్చి.. స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలంటూ మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లాడు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు వచ్చి పక్కన కూర్చున్నారు. 

తమకు పై నుంచి ఒత్తిడి ఉందని, తప్పుగా అనుకోవద్దని చెబుతూనే కానిస్టేబుళ్లకు సైగ చేశారు. కానిస్టేబుళ్లు నన్ను గోడకు అనించి కూర్చో­బెట్టి, రెండు కాళ్లు ఎడం చేసి గట్టిగా లాగి పంగ చీల్చారు. నొప్పితో అరవడంతో కాసేపు ఆపి.. రెండోసారి కూడా అలాగే చేశారు. నొప్పితో తర్వాత లేచి నిల్చుని నడవలేక పోయాను. కొంచెం సేపు నెమ్మదిగా నడిపించి కిందికి పంపారు. చాలా నొప్పిగా ఉంది. నన్ను అంతం చేసేందుకే టీడీపీ నాయకులు ఈ వ్యవహారం అంతా చేస్తున్నారు’ అని న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 

దీంతో న్యాయమూర్తి అంబటి రాంబాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. తమ విధులకు అడ్డు పడ్డారంటూ నల్లపాడు ఎస్‌ఐ చేత పెట్టించిన కేసులో రిమాండ్‌ను తిరస్కరించారు. దీంతో అంబటిని రాజ­మహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, అంతకు ముందు రాత్రి 7.30 గంటలకు అంబటికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 

న్యాయవాదుల ఆగ్రహం
కోర్టు ఆవరణలో కూడా బ్యారికేడ్లు పెట్టడం, పోలీసులు తమను పదే పదే బయటకు పంపే ప్రయత్నం చేయడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసుల వల్ల తమకు కోర్టులో కూడా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. 

అంబటిని ఏ జైలుకు తరలిస్తున్నారనే విషయం కూడా అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులకు చెప్పక పోవడం దారుణం అని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మీడియాతో మాట్లా­డారు. అంబటిని పోలీసులు ‘బాగా చూసుకున్నారు’ అని ఆమె తెలిపారు.

తిరుగుబాటు తప్పదు
ప్రభుత్వ పెద్దలు పరిపాలనను పక్కనపెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తు­న్నారు. అహంకార ధోరణితో కక్షగట్టి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేయడం దుర్మార్గంతో కూడిన రాక్షస చర్య. రెడ్‌బుక్‌ పేరుతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ శ్రేణులపై దాడులు చేయడం, తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేయడం మినహా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్నారా? తప్పుడు కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి

ఆటవిక రాజ్యంలో ఉన్నామా?
అంబటి రాంబాబుపై దాడికి పాల్పడటం దుర్మార్గం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా? సీబీఐ–సిట్‌ దర్యాప్తులో లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని తేల్చింది. దీనిని డైవర్ట్‌ చేసేందుకు టీడీపీ గూండాలు అంబటి రాంబాబు ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. – రామసుబ్బారెడ్డి,  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే..
లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ నిగ్గు తేల్చ­డంతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం తమదేనన్న మదంతో అంబటి రాంబాబు ఇంటిపై పైశాచికంగా దాడులు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని దేవాలయం మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఈ రోజు ఏ దేవా­లయం మెట్లు కడుగుతారో చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్‌ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు.  – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే

రాష్ట్రంలో రాబందుల పాలన
రాష్ట్రంలో రాబందుల పాలన నడుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలో ఉన్నంతకాలం పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేస్తున్నారు. చంద్రబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనతో ఏపీని ఆటవిక ప్రదేశ్‌గా మార్చేశారు.  – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌ విభాగం అధ్యక్షుడు

చంద్రబాబు నేతృత్వంలో వికృత పాలన
వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేసే వికృత రాజకీయ క్రీడ రాష్ట్రంలో కొనసాగుతోంది. లోకేశ్‌ తోడల్లుడికి చెందిన గీతం వర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడంతో రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల ఆలోచనలను మళ్లించేందుకు పథకం ప్రకారం అంబటి రాంబాబుపై దాడి చేశారు.   – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి

బిహార్‌ తరహా ఆటవిక పాలన
రాష్ట్రంలో బిహార్‌ తరహా పాలనకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇంటిపై అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం.  అంబటి ఇంటిపైన, మరో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపైన పెట్రోల్, కిరోసిన్‌ బాంబులతో దాడికి దిగారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి ఇది నిదర్శనం. – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి

దాడులకు భయపడం 
రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులపై కూటమి మూకలు దాడులు చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌ ఇంటిపై దాడి చేయడం అమానుషం. డీజీపీ పచ్చచొక్కాను వీడి ఖాకీ చొక్కా ధరించాలి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగటం సిగ్గుచేటు. వైఎస్సార్‌సీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేసూ్తనే ఉంటాం. – తలశిల రఘురాం, ఎమ్మెల్సీ

అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తాం..
అంబటి రాంబాబుపై జరిగిన దాడి గురించి కేంద్ర హోంశాఖకు, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళతాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్‌ వేదికగా తెలియజేస్తాం. బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులు దాడిచేసేవారికి రక్షణ కల్పించడం దుర్మార్గం.  – వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ

వ్యూహం ప్రకారమే దాడి 
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్య­లను బట్టి వ్యూహం ప్రకారమే అంబటిపై దాడి జరిగిందనిపిస్తోంది. ఈ కేసులో పోలీసుల్ని నిందితుల్ని చేయాలి.  – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎంపీ

పోలీసులు చోద్యం చూశారు
అంబటి రాంబాబు కారులో వస్తుండగా ఆయన్ని అడ్డగించి టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భర్త సమక్షంలో దాడి జరిగింది.  – వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఎంపీ

అంబటిని రెచ్చగొట్టారు 
లడ్డూ వ్యవహారంలో అంబటి రాంబాబుపై 24 గంటల ముందునుంచే వ్యూహం పన్ని ఆయన్ని  రెచ్చగొట్టారు. టీటీడీ ఈవోపై ప్రభుత్వం అభాండాలు వేస్తోంది. వైఎస్‌ జగన్, వైవీ సుబ్బారెడ్డి తప్పుచేయలేదని సీబీఐ చార్‌్జషీట్‌ ద్వారా నిజం బహిర్గతమైంది.  – మేడ రఘునాథరెడ్డి, ఎంపీ  

హత్య చేయాలని చూశారు
అంబటి రాంబాబును హత్యచేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నం చేశారు. వందలాదిమంది ఆయన ఇంటిపై దాడిచేసి నిప్పంటించడం అత్యంత దుర్మార్గం. దీని ఉద్దేశం ఏమిటంటే హత్యచేయాలనే కదా? అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు? వారు పోలీసులా? గూండాలా? దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా అంబటి రాంబాబుపై కేసు పెట్టడం దారుణం.  – గొల్ల బాబూరావు, ఎంపీ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement