ఆంధ్ర ప్రదేశ్ సహా 5 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ హబ్‌లు
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ గనుల రంగానికి ప్రయోజనాలు
తీర ప్రాంతంలో బీచ్ శాండ్ ఖనిజం వెలికితీత పరిశోధనలకు ఊతం
దానికి సంబంధించిన భారీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏపీలో ఏర్పడే అవకాశం
సాక్షి, అమరావతి: దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే భవిష్యత్తు ఇంధనాలుగా పిలిచే అరుదైన ఖనిజాలు ఆంధ్ర ప్రదేశ్‌కు వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ ఈ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఇది కేవలం ఖనిజ తవ్వకాలకే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని ఒక పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు దోహదపడుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. అరుదైన ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామని నిర్మల ప్రకటించారు.
దీనికోసం బడ్జెట్‌లో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్‌సీఎంఎం) కింద రూ.16,300 కోట్లను కేటాయించారు. ఈ ఖనిజాల ద్వారా తయారయ్యే పర్మనెంట్ మాగ్నెట్స్ ఉత్పత్తి కోసం గత ఏడాది ప్రకటించిన రూ.7,280 కోట్ల ఇన్సెంటివ్ స్కీమ్‌ను ఈ కారిడార్‌కు అనుసంధానం చేయనున్నారు.
ఏపీలో విస్తారంగా రేర్ ఎర్త్ మినరల్స్..
ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మోనజైట్ అనే ఖనిజం ద్వారా పలు అరుదైన మూలకాలు లభిస్తాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నంవంటి ప్రాంతాలు ఈ బీచ్ సాండ్ నిక్షేపాలకు ప్రధాన కేంద్రాలు. అనంతపురం జిల్లాలోని దంచెర్ల, పెద్దవడుగూరు ప్రాంతాల్లోనూ రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
వైఎస్‌ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో గ్రాఫైట్, కోబాల్ట్, కాడ్మియం వంటి ఖనిజాలు ఉన్నాయి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ కారిడార్ ద్వారా కేవలం తీర ప్రాంతమే కాకుండా ఖనిజ నిక్షేపాలున్న లోతట్టు ప్రాంతాలను రవాణా పరంగా అనుసంధానించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మన ఖనిజ సంపదను ముడి రూపంలో తక్కువ ధరకు విదేశాలకు పంపించి తిరిగి వాటితో తయారైన ఖరీదైన బ్యాటరీలను, అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటున్నాం.
ఈ సంస్కృతికి విడనాడాలని భావిస్తున్నారు. ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే రిఫైనరీలు, ఖనిజాలను వేరు చేసే అత్యాధునిక ల్యాబ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీలను ఒకే తాటిమీదకు తెస్తారు. దీంతో ఖర్చు తగ్గి, స్థానికంగా ఉపాధి పెరుగుతుంది. బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ కారిడార్ విజయవంతం కావాలంటే పర్యావరణ ప్రభావం, స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా చూడటం ప్రధానమని నిపుణులు చెబుతున్నారు.
ఈసీఎంఎస్‌కు రూ.40 వేల కోట్లు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీలో ఆత్మనిర్భరతే లక్ష్యంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ను విస్తరించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ఆదివారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. చిప్‌ల తయారీరంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ పరిశ్రమల్లో ఉపకరణాల సేకరణ, ముడి సరకులు, దేశీయ డిజైన్లు, ఇతర ముడి సామగ్రి విషయంలో సముపార్జనే ధ్యేయంగా ముందుకెళ్లాలని నిర్ణయించామని నిర్మల చెప్పారు.
పారిశ్రామికంగా పరిశోధన శిక్షణా కేంద్రాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టామని, ఇందుకోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్(ఐఎస్‌ఎం) 2.0ను తీసుకొస్తామని నిర్మల వెల్లడించారు.‘‘ త్వరలో ఐఎస్‌ఎస్ 2.0ను తీసుకొచ్చి చిప్‌ల సంబంధ ఉపకరణాలు, మెటీరియల్స్, భారతీయ మేథోపర హక్కులున్న చిప్ డిజైన్, సరకు రవాణా గొలుసులను అభివృద్ధి చేస్తాం’’ అని నిర్మల వెల్లడించారు.
‘‘ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్)ను 2025 ఏప్రిల్‌లో రూ.22,919 కోట్లతో ఆరంభించాం. ఈ పథకానికి నిధుల కేటాయింపులను రూ.40,000 కోట్లకు పెంచుతున్నాం’’ అని నిర్మల చెప్పారు. ‘‘మొత్తంగా రూ.54,567 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వద్దకు జనవరి నాటికి 46 దరఖాస్తులు చేరాయి. ఈ ప్రాజెక్టులు సాకారమైతే మరో 51,000 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని నిర్మల చెప్పారు.


