భారత 77వ గణతంత్ర వేడుకలు ఈ రోజు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ సందర్భంగా ఓ వివాదం చెలరేగింది. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి మూడో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా అంటూ బీజేపీని ప్రశ్నించింది.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జీవాలా ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు" లోక్‌సభ ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా? ఇది సంప్రదాయాలు, మర్యాద, ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉందా? ఇది ప్రభుత్వం యెుక్క ఆత్మన్యూనత భావానికి నిదర్శనమనం అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన చర్యలకు పాల్పడిందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా అద్వానీ బీజేపీ నేత అయినప్పటికీ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చేదన్నారు. 2014లో అద్వానీ లోక్‌సభ ప్రతిపక్ష నేత కాదని అయినప్పటికీ కాంగ్రెస్ ఎంతో గౌరవంతో ఆయనకు ముందు వరసలో కూర్చొబెట్టి గౌరవం ఇచ్చిందన్నారు. ప్రస్తుతం మోదీ, అమిత్‌షాలు ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను అవమానిస్తున్నారని మాణిక్యం ఠాగూర్ అన్నారు.
అయితే దీనిపై కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటరిచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ మూడో వరుసలో కూర్చోవడంపై ఆందోళన చెందడం లేదు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన జరగుతున్నప్పుడు ఆయన తన మెుబైల్ చూస్తూ బిజీగా ఉన్నాడు. అని ఆయన అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.


