తద్వారా మరింత ఆదాయానికి మార్గం
ఇందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలి
ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలి
బడ్జెట్‌పై థింక్ చేంజ్ ఫోరమ్ సూచనలు
వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులను మరింత విస్తృతం చేసుకోవడంతోపాటు.. ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడంపై 2026–27 బడ్జెట్‌లో దృష్టి సారించాలని ‘థింక్ చేంజ్ ఫోరమ్’ (టీసీఎఫ్) సూచించింది. పన్నులను సులభతరం చేయడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఇటీవలి జీఎస్‌టీ 2.0 సంస్కరణలు నిరూపించినట్టు పేర్కొంది.
పన్ను వసూళ్లను పెంచుకునేందుకు అధిక పన్ను రేట్లు ఉండాలన్న దీర్ఘకాలిక నమ్మకాన్ని ఇది సవాలు చేసినట్టు తెలిపింది. జీఎస్‌టీ సంస్కరణల సూత్రాలను ప్రత్యక్ష పన్నులకూ విస్తరించాలని సూచించింది. విధానపరమైన స్పష్టత, నిబంధనల అమలు ఆధారిత వృద్ధి ఉండాలని పేర్కొంది. పరిహార సెస్సు ముగిసిన తర్వాత ఎంఆర్‌పీ ఆధారిత పన్నుల వ్యవస్థను నిలిపవేయాలని సూచించింది. ఉత్పాదకతను పెంచే పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, చట్టవిరుద్ధ/దొంగ రవాణాతో కూడిన సమాంతర ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరింది.
పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలి..
జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకునేందుకు పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసుకోవడంపై తక్షణం దృష్టి సారించాలని థింక్ చేంజ్ ఫోరమ్ నివేదిక ప్రధానంగా సూచించింది. 140 కోట్ల జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 2.5–3 కోట్లుగానే ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. రేట్లను పెంచడం కాకుండా టెక్నాలజీ సాయంతో పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసుకోవాలని కోరింది. ఇందుకు గాను జీఎస్‌టీ, ఆదాయపన్ను, అధిక వినియోగ డేటాను అనుసంధానించాలని సూచించింది.
గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ లాభదాయకత పెరిగినప్పటికీ.. జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి 2011 నాటి గరిష్ట స్థాయికి దిగువనే ఉన్నట్టు తెలిపింది. కంపెనీల లాభాలు ఉత్పాదకతను పెంచే సామర్థ్య విస్తరణకు కాకుండా, ఆర్థిక సాధనాల్లోకి వెళుతున్నట్టు పేర్కొంది. కనుక పన్ను ప్రోత్సాహకాలతోపాటు, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), ఉపాధి కల్పనను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని కోరింది.
ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?


