ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కొంతమంది మంచి రాజులు మారువేషాలేసుకుని నగర వీధుల్లో తిరిగేవారట!. రాజులు లేరు.. రాజరికం పోయింది. ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మారువేషాలు వేసుకునే ప్రజాప్రతినిధులు అరుదైపోతున్న ఈ కాలంలో ఒక ఎంపీ ఆ దిశగా ఒక అడుగు వేశారు. దేశంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న గిగ్ వర్కర్ల అసలు కష్టాలేమిటో అర్థం చేసుకునేందుకు తానూ రోజుపాటు ఆ పని చేశారు. ఎవరా ఎంపీ.. ఏమా కథ?..
రాఘవ్ చద్దా.. గిగ్ కార్మికుల హక్కులపై ఈ మధ్యకాలంలో గళం వినిపిస్తున్న ఏకైక ఎంపీ. క్విక్ కామర్స్ (Quick commerce) సంస్థల 10 నిమిషాల డెలివరీ వ్యవస్థతో మనుషుల ప్రాణాలు పోతున్నాయని.. అలాంటిదాన్ని పూర్తిగా నిషేధించాలని మొన్నీమధ్యే రాజ్యసభలోనూ ఆయన మాట్లాడారు. ఆ సమయంలో.. ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయిన బ్లింకెట్ డెలివరీ బాయ్ ఒక్కరోజు సంపాదనను ప్రముఖంగా ప్రస్తావించారాయన. అంతేకాదు.. ఆ డెలివరీ బాయ్ వివరాలు కనుక్కుని, తన వద్దకు రప్పించుకుని ఆతిథ్యం కూడా ఇచ్చి పంపించారు.
ఇప్పుడ మరో అడుగు ముందుకేశారు. గిగ్ కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు వేషం మార్చారు. బ్లింకెట్ డెలివరీ ఏజెంట్‌తో కలిసి ఆ అనుభవం ఏంటో చవిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అఫ్‌కోర్స్.. ఈ చర్యను కూడా విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఇది ఢిల్లీలో చేశారా? పంజాబ్‌లో చేశారా?(ఆయన పంజాబ్ కోటాలో రాజ్యసభ ఎంపీ అయ్యారని) అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే ఆయన చర్యను మెచ్చుకునేవాళ్లు కూడా కనిపిస్తున్నారు. అయితే.. ఆ పనిలో అనుభవమేంటో ఆయన ఇంకా వివరించాల్సి ఉంది.
Away from boardrooms, at the grassroots. I lived their day.
Stay tuned! pic.twitter.com/exGBNFGD3T— Raghav Chadha (@raghav_chadha) January 12, 2026
‘‘గిగ్ కార్మికులు రోబోలు కాదు. ఈ విషయంపై సభ ఆలోచన చేయాలి. 10 నిమిషాల్లో డెలివరీ అనేది క్రూరత్వం. ఈ పద్ధతికి ముగింపు పలకాలి. వేగంగా సేవలు అందుతున్నాయని వినియోగదారులు ఆశిస్తున్నప్పటికీ.. గిగ్ కార్మికుల సంక్షేమం గురించి చట్టసభ ఆలోచించాలి. రేటింగ్ తగ్గించడం, ప్రోత్సాహకాల్లో కోత, ఐడీ బ్లాక్ వంటి భయాలతో నిర్దిష్ట సమయంలో డెలివరీ చేసేందుకు కార్మికులు (Gig Workers) వేగంగా, సిగ్నల్స్ జంప్ చేస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వీటితోపాటు కస్టమర్ల వేధింపులు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి రావడం వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. గిగ్ కార్మికులు భారత ఆర్థిక వ్యవస్థకు కనిపించని చక్రాలు. కానీ వాళ్ల పరిస్థితి రోజువారీ కూలీల కంటే దారుణంగా ఉంటోంది
:::రాజ్యసభలో రాఘవ్ చద్దా


