భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి (Smriti Mandhana) గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఆమెను మోసం చేసిన కారణంగానే వివాహం నిరవధికంగా వాయిదా పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తోడు పలాష్‌తో చాట్ చేసింది తానేనంటూ ఓ అమ్మాయి గురువారం ధ్రువీకరించింది.
స్మృతి తన ఆరాధ్య క్రికెటర్ అని, అలాంటి అమ్మాయికి పలాష్ నిజస్వరూపం తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశానని సదరు యువతి పేర్కొంది. అయితే, పలాష్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ చాట్స్ కూడా చాన్నాళ్ల క్రితం నాటివంటూ ట్విస్టు ఇచ్చింది.
మరోవైపు.. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి ఎలాంటి స్పందన రాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్ ముచ్చల్ (Palash Mucchal) తల్లి అమిత మరోసారి మీడియా ముందుకు వచ్చారు.
మానసిక వేదన వర్ణనాతీతం
హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘పెళ్లి జరగాల్సిన రోజు ఎదురైన పరిణామాలతో ఇద్దరూ తీవ్రమైన బాధలో కూరుకుపోయారు. ఇద్దరి మానసిక వేదన వర్ణనాతీతం. తన వధువు (భార్య)తో ఇంట్లో అడుగుపెట్టాలని పలాష్ కలలు కన్నాడు.
తొందర్లోనే పెళ్లి!
నేను కూడా కోడలికి ఘనంగా స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేసుకున్నాను. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. తొందర్లోనే పెళ్లి జరుగుతుంది’’ అని అమిత ముచ్చల్ (Amita Mucchal) పేర్కొన్నారు. అయితే, మంధాన కుటుంబం మాత్రం స్మృతి- పలాష్‌ల పెళ్లి విషయమై స్పందించలేదు.
ఘనంగా వేడుకలు
కాగా 2019 ప్రేమలో ఉన్న స్మృతి- పలాష్.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. స్మృతి స్వస్థలం సాంగ్లీలో నవంబరు 23న వివాహ వేడుకకు ముహూర్తం ఖరారు కాగా.. హల్దీ, సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.
అయితే, ఊహించని రీతిలో పెళ్లికి గంటల ముందు కార్యక్రమం వాయిదా పడింది. స్మృతి తండ్రి గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. ఆ తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. పలాష్ స్మృతిని మోసం చేశాడని.. అతడితో గొడవ పడే క్రమంలోనే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లారు.
ఆ వీడియోలు డిలీట్ చేసిన స్మృతి
ఈ నేపథ్యంలో పలాష్ తల్లి అమిత ముచ్చల్ స్పందిస్తూ.. స్మృతి తండ్రి అంటే తన కుమారుడికి ఎంతో ఇష్టమని.. ఆయన అనారోగ్యం పాలు కావడం తట్టుకోలేక అతడూ ఆస్పత్రి పాలయ్యాడని తెలిపారు. స్మృతి కంటే ముందు పలాషే వివాహాన్ని వాయిదా వేద్దామని చెప్పారు. తాజాగా ఆమె మరోసారి పైవిధంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. స్మృతి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలన్నీ డిలీట్ చేయడం గమనార్హం.
చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్ ఎంత?


