భారత్ ఇటీవల ఐసీసీ ఉమెన్ ప్రపంచ కప్ టోర్నీలో విజయం సాధించిన తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలం అంచనాలను మించిపోయింది. ఆటగాళ్లకు కోట్ల రూపాయాలు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దాంతోపాటు చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ వంటి ప్రముఖ సంస్థలు లీగ్‌లో కొత్త స్పాన్సర్‌లుగా చేరడం గమనార్హం. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5, 2026 వరకు షెడ్యూల్ చేసిన నాలుగో ఎడిషన్ డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్‌కు పెరుగుతున్న కార్పొరేట్ కంపెనీల ఆసక్తిని ఇది హైలైట్ చేస్తుంది.
ఐసీసీ ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ను గెలుచుకున్న టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ రూ.3.2 కోట్లతో ఈ వేలంలో అత్యధిక ధర సాధించారు. వేలం పూల్‌లో 73 స్లాట్‌ల కోసం 277 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. అగ్రశ్రేణి క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించాయి. వేలంలో అధిక ధర సాధించిన కొందరు ఆటగాళ్ల వివరాలు కింది విధంగా ఉంది.
అమెలియా కెర్ (న్యూజిలాండ్): ముంబై ఇండియన్స్‌కు రూ.3 కోట్లు
శిఖా పాండే (భారత్): యూపీ వారియర్జ్ రూ.2.4 కోట్లు
సోఫీ డివైన్ (న్యూజిలాండ్): గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లు
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా): యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లు
శ్రీచరణి (భారత్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లు
చినెల్లె హెన్రీ (వెస్టిండీస్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లు
ఆశా శోభన (భారత్): యూపీ వారియర్జ్ రూ.1.1 కోట్లు
స్పాన్సర్‌షిప్‌లు..
కొత్తగా చేరిన చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ లీగ్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి. బీసీసీఐ ప్రకటన ప్రకారం ఈ మూడు సంస్థల ఒప్పందాల విలువ రూ.48 కోట్లు. ఇది 2026, 2027 సీజన్లలో కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్న అగ్రశ్రేణి భాగస్వాముల వివరాలు ఇలా ఉన్నాయి.
టాటా గ్రూప్ (టైటిల్ పార్టనర్)
సింటెక్స్, హెర్బాలైఫ్ (ప్రీమియర్ భాగస్వాములు)
సియట్ (స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్)
ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?


