కాస్త పరికించి చూడండి... బౌల్‌లో బిర్యానీపైనున్న అనాసపువ్వును చూస్తే అందాల రాణి తలపైనున్న కిరీటంలా కనిపించడం లేదూ! మరికాస్త పరిశీలనగా చూడండి... అందులోని బిర్యానీ ఆకుల్ని చూస్తే అందాలరాణికి అన్నివైపులా వీస్తున్న వింజామరల్లా లేవూ! ఇంకాస్త అవలోకించి చూడండి... ఆ పక్కనున్న మరాఠీమొగ్గల్ని చూడండి... భల్లాలదేవుడి పక్కనున్న బాహుబలి ఛత్రంలా పట్టుకున్న బల్లెంలా అనిపించడం లేదూ!
ఇంతింత వర్ణన ఎందుకంటారా? ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైస్‌తో తయారు చేసే పది 50 వంటకాలను ఎంపిక చేస్తే అందులో మన బిర్యానీ... ఏదీ మన దమ్మున్న బిర్యానీ అయిన హైదరాబాదీ దమ్ బిర్యానీ పదవస్థానంలో నిలిచింది. పదిలో ఉన్న మన బిర్యానీని పద పద తిందామంటూ ఆవురావురంటున్నారట లోకంలోని రైసాహార ప్రియులు.
బెస్ట్ ఫుడ్ అండ్ సిటీస్ అనీ, బెస్ట్ డిష్ అనీ, బెస్ట్ క్యూజిన్ అనీ... ఇలా ఆహారాల విషయంలో సంప్రదాయ ఆహార అవార్డులు (ట్రెడిషనల్ ఫుడ్ అవార్డ్స్) ఇచ్చే‘టేస్ట్ అట్లాస్’ సంస్థ నిర్వహించిన ఒక ఎంపిక కార్యక్రమంలో రైస్‌తో చేసే ఆహారాల్లో మన బిర్యానీకి దశకం దక్కింది. దక్కిందంటే దక్కదా మరి... బిర్యానీ రైసులోకి వడ్డించే రైతా కోసం మర్డర్లు జరిగిన చరిత్ర ఉన్న మన బిర్యానీకి ఆమాత్రం గౌరవం దక్కొద్దా మరి!
ఇలా పద్ధతిగా పదిలంగా పదోస్థానంలో దక్కించుకున్న తర్వాత ఎట్టకేలకు తెలిసిందేమిటంటే... మనమంటే ఏదో లోకల్ ఫీలింగుతో బిర్యానీని తలకెక్కించుకున్నాం అనుకున్నా... అది తప్పనీ... లోకో భిన్న‘రుచి’ అనుకునే ఈ ప్రపంచవ్యాప్త లోకప్రియత్వంలోనూ మిగతా 50 డిష్షుల్లో మరో 40 స్థానాలకంటే కూడా అది పైనే ఉందని తేలింది. మన ఈ డిష్షు... మిగతా 50 రైసు డిష్షులను డిష్యుం డిష్యుం అని కొట్టేసి మరీ ఈ పదో స్థానం కొట్టేసిందంటే అది మనకు కూడా గ్రేటే కదా!
ఇక క్యూరియాసిటీ కోసం మిగతా తొమ్మిది రైసు డిష్షులేవో చూద్దామా? వీటిల్లో జపాన్‌లోనే వండీనెగిటోరోడాన్‌కు మొదటిస్థానం, సూశీకి రెండో ప్లేసూ, మూడులో కెయిసెండాన్, నాలుగులో ఒటోరో నిగిరీ, ఏడులో చుటోరో నిగిరీ, ఎనిమిదిలో ప్లెయిన్ నిగిరీ, తొమ్మిదిలో మాకీ అనే రైసు వంటకాలున్నాయి. ఇక జపాన్ వంటల ఆధిపత్యానికి గండి కొడుతూ ఐదోస్థానంలో అర్రాజ్ ట΄ోడా, ఆరులో కెన్యావాళ్ల కుకాంగా అనే వంటకాలు నిలిచాయి. అదీ మరి... రైసు వంటకాల రేసులో మన హైదరాబాద్ బిర్యానికి దక్కిన గౌరవమంటే ఇదే మరి!!
(చదవండి: రుతుక్రమ సమస్యలకు సీడ్ సైకిల్)


