వరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనాను.. భారత్ అధిగమించింది. దీంతో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
150.18 మిలియన్ టన్నులు
భారతదేశంలో వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులు కాగా.. చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం 25 పంటలకు చెందిన 184 కొత్త రకాలను విడుదల చేస్తూ వెల్లడించారు. అంతే కాకుండా అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు పంట ఉత్పత్తిని & రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, ఈ కొత్త రకాలు రైతులకు త్వరగా చేరేలా చూడాలని మంత్రిత్వ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.

దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ.. అధిక దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధిలో దేశం గొప్ప విజయాన్ని సాధించిందని అన్నారు. 1969లో గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి.. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఫైబర్ పంటలు వంటి మొత్తం 7,205 పంట రకాలు నోటిఫై చేసినట్లు పేర్కొన్నారు.
2014 తర్వాత పెరుగుదల..
1969, 2014 మధ్య నోటిఫై చేసిన 3,969 రకాలతో పోలిస్తే.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 3,236 అధిక దిగుబడినిచ్చే రకాలను ఆమోదించిందని చౌహాన్ తెలియజేశారు. భారత్ ఆహార కొరత ఉన్న దేశం నుంచి ప్రపంచ ఆహార ప్రదాతగా మారిందని, ఇప్పుడు విదేశీ మార్కెట్లకు బియ్యాన్ని సరఫరా చేస్తోందని అన్నారు.
దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, తద్వారా భారతదేశ ఆహార భద్రతకు భరోసా లభిస్తుందని చౌహాన్ అన్నారు. అంతే కాకుండా.. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి పప్పుధాన్యాలు & నూనెగింజల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని మంత్రి వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు.

సమిష్టి కృషి ఫలితం
అధిక దిగుబడినిచ్చే.. విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే విత్తనాల అభివృద్ధి బలంతో దేశం వ్యవసాయ విప్లవం యొక్క కొత్త యుగంలోకి ప్రవేశించిందని చౌహాన్ అన్నారు. ఈ విజయం ఐసిఎఆర్ యొక్క పంటలపై అఖిల భారత సమన్వయ ప్రాజెక్టులు, రాష్ట్ర మరియు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషి ఫలితమని కేంద్ర మంత్రి అన్నారు.
ఇటీవల విడుదల చేసిన మొత్తం 184 రకాల్లో.. 122 తృణధాన్యాలు, 6 పప్పు ధాన్యాలు, 13 నూనె గింజలు, 11 పశుగ్రాస పంటలు, 6 చెరకు, 24 పత్తి (22 బిటి పత్తితో సహా), 1 జనపనార, 1 పొగాకు ఉన్నాయి.
ఇదీ చదవండి: స్టార్‌లింక్ సేవలు ఫ్రీ.. మస్క్ కీలక ప్రకటన


