మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)- 2026 వేలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అమ్మాయిలు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2025లో విజయంలో భాగమైన శ్రీచరణి, అరుంధతి రెడ్డి (హైదరాబాద్) మరో సందేహం లేకుండా ఎంపికయ్యారు. అరుంధతి రెడ్డిని రూ. 75 లక్షలకు ఆర్‌సీబీ జట్టు ఎంచుకుంది.
గొంగడి త్రిషకు తొలిసారి చాన్స్
అండర్–19 వరల్డ్ కప్ విజయంలో భాగమైన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో చాన్స్ లభించడం విశేషం. మమత మాదివాల, నల్లా క్రాంతి రెడ్డి కూడా ఎంపికయ్యారు.
గొంగడి త్రిషను రూ. 10 లక్షలకు యూపీ వారియర్స్... మమతను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్... క్రాంతి రెడ్డిని రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి.
శ్రీచరణి స్థాయి పెరిగింది...
వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన నల్లపు రెడ్డి శ్రీచరణి 2025 డబ్ల్యూపీఎల్‌లో రూ.55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రధాన పాత్ర పోషించడంతో సహజంగానే ఆమె స్థాయి పెరిగింది.
వేలానికి ముందు ఆమెను విడుదల చేసిన ఢిల్లీ ఇక్కడ మళ్లీ పోటీ పడింది. కనీస విలువ రూ.30 లక్షలతో మొదలై ఢిల్లీ, యూపీ మధ్య పోరు సాగింది. చివరకు రూ.1.30 కోట్ల వద్ద వేలం ముగిసింది. ఈ మేరకు.. ఢిల్లీ భారీ మొత్తంతో తమ ప్లేయర్‌ను తిరిగి సొంతం చేసుకుంది.


