ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారాను ఓడించిన భారత టీనేజర్
ప్రణయ్‌కు మన్‌రాజ్ షాక్
సయ్యద్ మోడీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
లక్నో: భారత యువ షట్లర్ తన్వీ శర్మ సంచలనం సృష్టించింది. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ నొజోమి ఒకుహరా (జపాన్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 16 ఏళ్ల తన్వీ శర్మ 13–21, 21–16, 21–19తో రెండో సీడ్ ఒకుహరాపై విజయం సాధించింది.
59 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్ కోల్పోయిన అనంతరం పుంజుకున్న తనీ్వ... అద్వితీయ ఆటతీరుతో 2017 ప్రపంచ చాంపియన్ ఒకుహారాను కంగుతినిపించింది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన తన్వీ... ఒకుహరాపై గెలవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ‘ఈ ఏడాది నాకు గొప్పగా సాగుతోంది.
ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించా. ఒకుహరాను ఓడిస్తానని అస్సలు ఊహించలేదు. అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. తొలి గేమ్‌లో చాలా అనవసర తప్పిదాలు చేశాడు. ఆ సమయంలో గెలుపోటముల గురించి పక్కనపెట్టి నీ ఆట నువ్వు ఆడు అని కోచ్ సూచించారు. దాన్నే కొనసాగించి ఫలితం సాధించా. సుదీర్ఘ ర్యాలీస్ ఆడేందుకు నేను సిద్ధమే. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నా’ అని తన్వీ పేర్కొంది.
ప్రణయ్ పరాజయం
ఇక పురుషుల సింగిల్స్‌లో 19 ఏళ్ల మన్‌రాజ్ 21–15, 21–18తో హెచ్‌ఎస్ ప్రణయ్‌పై విజయం సాధించాడు. 43 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ప్రణయ్ వరుస గేమ్‌ల్లో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్ ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ ఉన్నతి హుడా 21–15, 21–10తో తస్నీమ్ మీర్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
ఇషారాణి బారువా 21–15, 21–8తో ఆరో సీడ్ పొలినా బుహ్‌రోవా (ఉక్రెయిన్)పై, రక్షిత శ్రీ 16–21, 21–19, 21–17తో దేవికా సిహాగ్‌పై విజయాలతో ముందంజ వేశారు. తాన్యా, అనుపమ పరాజయాలతో ఇంటిబాట పట్టారు.
శ్రీకాంత్ ముందుకు
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21–6, 21–16తో సనీత్ దయానంద్‌పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మిథున్ మంజునాథ్ 21–16, 17–21, 21–17తో ఆరో సీడ్, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లిపై, ప్రియాన్షు రజావత్ 21–16, 10–21, 21–12తో రాహుల్ భరద్వాజ్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నారు.
కిరణ్ జార్జ్, ఆలాప్ మిశ్రా, సిద్ధార్థ్ గుప్తా టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల డబుల్స్‌లో ఐదో సీడ్ హరిహరన్–అర్జున్ జంట 21–12, 21–18తో లా యీ షెంగ్–లిమ్ జె జియాన్ (మలేసియా) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ ద్వయం 21–17, 21–12తో జెనిత్–లిఖిత (భారత్) జంటపై నెగ్గి క్వార్ట్ ఫైనల్లో అడుగు పెట్టింది.


