చాంపియన్ ముంబై ఇండియన్స్ (PC: WPL/BCCI)
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. తాజా ఎడిషన్‌లో నవీ ముంబై, వడోదరలను ఈ మెగా ఈవెంట్ వేదికలుగా ఖరారు చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 మధ్య డబ్ల్యూపీఎల్ నాలుగో ఎడిషన్ నిర్వహిస్తామని వెల్లడించింది.
డబ్ల్యూపీఎల్-2026 మెగా వేలం సందర్భంగా లీగ్ చైర్మన్ జయేశ్ జార్జ్ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. న్యూఢిల్లీ వేదికగా మెగా వేలం మొదలుకాగా.. ఐదు ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ప్లేయర్ల కోసం పోటీపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు రెండుసార్లు టైటిల్ అందించిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా వేలంలో కూర్చోవడం విశేషం.
ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్ 2023లో మొదలై ఇప్పటికి మూడు సీజన్లు పూర్తిగా డబ్ల్యూపీఎల్ తొలి చాంపియన్‌గా ముంబై నిలిచింది. ఆ మరుసటి ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ స్మృతి మంధాన ట్రోఫీ అందించింది. ఈ ఫ్రాంఛైజీకి ఇదే తొలి టైటిల్. ఇక ఈ ఏడాది హర్మన్ మరోసారి తన సారథ్యంతో ముంబైని విజేతగా నిలిపింది.
కాగా డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పాల్గొంటున్నాయి.


