సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీ కారణంగా జట్టు పగ్గాలను రాహుల్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అప్పగించింది. అయితే తొలుత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను తాత్కాలిక వన్డే కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చాయి.
పంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మెన్ ఇన్ బ్లూకు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపింది. అయితే పంత్‌కు కాకుండా రాహుల్‌ను నియమించడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.
"సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో మాత్రమే కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శుభ్‌మన్ గిల్ తిరిగి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమయానికి అందుబాటులో వచ్చే అవకాశముంది. అతడు తన గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.
ఇక రిషబ్ పంత్ సంవత్సర కాలంలో కేవలం ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందుకే అతడిని కెప్టెన్సీ ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. కాగా పంత్ గతేడాది శ్రీలంకపై భారత్ తరపున చివరగా ఆడాడు. అప్పటి నుంచి వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు అతడు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనానికి అతడు సిద్దమయ్యాడు.
ఇక ఈ వన్డే సిరీస్‌కు గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. అదేవిధంగా బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో జట్టులోకి రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, జైశ్వాల్ వచ్చారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.
భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్‌దీప్, ధ్రువ్ జురెల్.
చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన


