భారత్- బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ వివాదం ముదురుతోంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాళ్లను తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్ రహమాన్‌ను విడుదల చేసింది.
షాకిచ్చిన ఐసీసీ
ఈ క్రమంలో బంగ్లాదేశ్ టీమిండియా టూర్‌కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయగా.. ఈ పర్యటనపై తాము నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాబోమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు ప్రగల్భాలు పలకగా.. ఐసీసీ ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైనందున యథావిధిగా మ్యాచ్‌లు సాగుతాయని స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్ అంత పని చేసిందా?
ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నుంచి భారత స్పోర్ట్స్ ప్రజెంటర్ రిధిమా పాఠక్ (Ridhima Pathak)ను తొలగించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఆమె స్వయంగా స్పందించింది. తనకు దేశమే మొదటి ప్రాధాన్యం అని.. అందుకే తానే లీగ్ నుంచి వైదొలిగినట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.
దేశం కోసం నేనే తప్పుకొన్నా!
‘‘నన్ను బీపీఎల్ నుంచి తొలగించారని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ఈ లీగ్ నుంచి తప్పుకోవాలనే నేనే నిర్ణయించుకున్నాను. దేశ ప్రయోజనాలే నాకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం.
అదే విధంగా ఆట పట్ల కూడా నాకు నిబద్ధత ఉంది. ఇన్నాళ్లుగా స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా నిజాయితీ, అంకితభావం, గౌరవం, ప్యాషన్‌తో పనిచేశాను. దీనిలో ఇక ముందు కూడా ఎలాంటి మార్పూ ఉండదు. క్రికెట్ సమగ్రత కోసం నేను ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఉంటాను.
ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్రికెట్ విషయంలో నిజం చెప్పడం ముఖ్యం. ఇకపై ఈ అంశం గురించి నేను స్పందించను. జై హింద్’’ అని రిధిమా పాఠక్ పేర్కొంది.


