క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంటి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి ఏకైక కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ ముహూర్తం ఖరారయ్యింది. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు సానియా ఛందోక్‌ను అర్జున్ మనువాడనున్నాడు.
వీరి వివాహం మార్చి 5న జరుగనుందని నివేదికలు చెబుతున్నాయి. అధికారిక సమాచారమైతే లేదు. వివాహ వేడుకలు మార్చి 3న ప్రారంభమవుతాయని తెలుస్తుంది. ఎక్కువ భాగం కార్యక్రమాలు ముంబైలోనే జరగనున్నట్లు సమాచారం. అతిథుల జాబితాను కూడా ఇరు కుటుంబాలు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
అర్జున్–సానియా చిన్ననాటి నుంచి స్నేహితులు. టెండూల్కర్–ఘై కుటుంబాల మధ్య ఉన్న బంధం వారి స్నేహాన్ని మరింత బలపరిచింది. గతేడాది ఆగస్ట్‌లో అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ వీరి నిశ్చితార్థం జరిగింది.
ఈ వేడకను ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. కొద్ది రోజుల తర్వాత సచిన్ ఓ వ్యక్తిగత కార్యక్రమంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. సానియా Mr. Paws అనే లగ్జరీ పెట్ స్పా వ్యవస్థాపకురాలు. అదే సంస్థకు ఆమె డైరెక్టర్‌గానూ ఉన్నారు.
అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను గోవా తరఫున విజయ్ హజారే ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో అతను ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. అర్జున్‌ను ఇటీవల ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్ ద్వారా 30 లక్షల బేస్ ధరకే ముంబై ఇండియన్స్ నుంచి దక్కించుకుంది.
లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 26 ఏళ్ల అర్జున్ దేశవాలీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాకు ఎంపిక కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే అతని కల సాకారం కావడం లేదు.


