న్యూఢిల్లీ: భారత జట్టు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ గంభీర్‌కు అండగా నిలిచాడు. కోచ్ కేవలం జట్టును సిద్ధం చేస్తాడని... మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని గావస్కర్ అన్నాడు.
దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 30 పరుగులతో ఓడిన టీమిండియా... రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టు మూడో టెస్టు సిరీస్ ఓటమి చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడిన టీమిండియా, ఆస్ట్రేలియాలో 1–3తో సిరీస్ కోల్పోయింది.
ఈ నేపథ్యంలో గావస్కర్ మాట్లాడుతూ... ‘అతడు ఒక కోచ్. జట్టును సిద్ధం చేయడం అతడి పని. తనకున్న అనుభవంతో ఎలా ఆడాలో చెప్పగలడు. కానీ, మైదానంలో ఆడాల్సింది ప్లేయర్లే. ఈ సిరీస్ పరాజయానికి గంభీర్‌ను బాధ్యుడిని చేయాలంటున్న వారికి నేను ఓ సూటి ప్రశ్న వేస్తున్నా. గంభీర్ నేతృత్వంలోనే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచింది. అప్పుడు అతడిని వన్డే, టి20ల్లో జీవితాంతం కోచ్‌గా ఉంచాలని మీరు చెప్పారా.
మరి అలాంటిది ఇప్పుడు టెస్టు సిరీస్ ఓడినప్పుడు అతడిని తొలగించాలని ఎలా డిమాండ్ చేయగలరు. ఒక జట్టు బాగా రాణించనప్పుడు మాత్రమే కోచ్ వైపు చూస్తారు’ అని గావస్కర్ అన్నాడు. మూడు ఫార్మాట్లకు గంభీర్‌ను కోచ్‌గా కొనసాగించడాన్ని సన్నీ సమర్థించాడు. ఇంగ్లండ్ జట్టుకు బ్రెండన్ మెక్‌ల్లమ్ అన్ని ఫార్మాట్లలో కోచింగ్ ఇస్తున్న అంశాన్ని గుర్తు చేశాడు.
గంభీర్‌కు అండగా అశ్విన్
దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ పరాజయానికి కోచ్ గౌతమ్ గంభీర్‌ను బాధ్యుడిని చేయడం తగదని... భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. గంభీర్ కాంట్రాక్టు 2027 వరకు ఉండగా... అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘ఇదొక క్రీడ. గెలుపోటములు సహజం. జట్టును నిర్వహించడం అంత సులభం కాదు. ఈ పరాజయానికి గంభీర్ కూడా బాధపడుతున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యలను చేసి తప్పిస్తే మంచిదని అనిపించవచ్చు. కానీ అది సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం ఆశిస్తుంటారు.
భారత క్రికెట్ ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. అందుకే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలా అని కోచ్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పైనా దాడి చేయడం తగదు’ అని అశ్విన్ వివరించాడు.


