భారత క్రికెటర్, కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani)కి జాక్‌పాట్ తగిలింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఆమె కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో శ్రీచరణికి భారీ ధర దక్కింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో శ్రీచరణిది ముఖ్య భూమిక. ఈ మెగా ఈవెంట్లో శ్రీచరణి ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నిలిచింది.
రూ. 30 లక్షల కనీస ధర
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ విజేత శ్రీచరణికి భారీ ధర దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె అదరగొట్టింది. రూ. 30 లక్షల కనీస ధరతో శ్రీచరణి వేలంలోకి రాగా.. యూపీ వారియర్స్ తొలి బిడ్ వేసింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగి.. ధరను ఏకంగా రూ. 75 లక్షలకు పెంచింది.
దీంతో యూవీ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఆ వెంటనే మళ్లీ రూ. 90 లక్షలకు ధరను పెంచింది. ఈ క్రమంలో శ్రీచరణిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచగా.. యూపీ వెనక్కి తగ్గింది. ఫలితంగా శ్రీచరణి రూ. 1.3 కోట్లకు మళ్లీ సొంతగూటి (ఢిల్లీ)కి చేరుకుంది.
ఎదురులేని చరణి
కాగా గతంలో శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడింది. 2024 సీజన్‌లో రూ. 55 లక్షలకు ఆమెను ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక ధర దక్కించుకున్న నాటి అన్‌క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో శ్రీచరణి చేరింది. అరంగేట్రంలోనే ఎలిస్ పెర్రీని అవుట్ చేసి ఆగమనాన్ని ఘనంగా చాటింది ఈ స్పిన్ బౌలర్.
ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీచరణి 2025 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. శ్రీలంకతో ముక్కోణపు వన్డే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీ20లలోనూ అడుగుపెట్టింది. 4/12 గణాంకాలతో సత్తా చాటి తొలి అంతర్జాతీయ టీ20లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.
ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున 18 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన 21 ఏళ్ల శ్రీచరణి.. వరల్డ్‌కప్‌లో ఏకంగా పదకొండు వికెట్లు కూల్చి సత్తా చాటింది. ప్రపంచకప్ విజేతగా డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె కనీస ధర.. దాదాపుగా 333 శాతం పెరగడం విశేషం.


