న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపికైంది. భారత జట్టు తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమాకు ఢిల్లీ జట్టు పగ్గాలు అప్పగిస్తన్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో జెమీమా వీరోచిత సెంచరీ సాధించడంతో టీమిండియా ఆ్రస్టేలియాపై విజయం సాధించింది.
‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండటం గౌరవంగా భావిస్తున్నా. నా మీద నమ్మకముంచిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ ఏడాది నాకు ఎంతో బాగా సాగింది. వరల్డ్‌కప్ గెలిచిన ఆనందంలో ఉన్న సమయంలోనే ఈ వార్త నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మూడేళ్లుగా ఇదే జట్టుతో సాగుతున్నా. ఎంతో నేర్చుకున్నా. గత మూడు సార్లు ఫైనల్ చేరినా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయాం. ఈ సారి ఆ గెలుపు గీత దాటుతాం’అని జెమీమా పేర్కొంది.
డబ్ల్యూపీఎల్ ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా... 27 మ్యాచ్‌లాడి 139.67 స్ట్రయిక్ రేట్‌తో 507 పరుగులు చేసింది. లీగ్‌లో ఇప్పటి వరకు మూడుసార్లు ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరగా... మూడింట్లోనూ జెమీమా ఆడింది. గతంలో ఢిల్లీ జట్టుకు మెగ్ లానింగ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూపీఎల్‌లో తమ తొలి మ్యాచ్‌లో జనవరి 10న ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.


