breaking news
Hyderabad Cricket Team
-
హైదరాబాద్ X ఆంధ్ర
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ కొత్త సీజన్లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. గ్రూప్ ‘బి’లో భాగంగా నేటి నుంచి మూలపాడు (విజయవాడ) మైదానంలో జరిగే పోరులో ఇరు జట్లు తలపడతాయి. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 40 పరుగుల తేడాతో చిన్న జట్టు త్రిపురను చిత్తు చేయగా... పటిష్టమైన కర్నాటకతో జరిగిన తమ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించింది. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. న్యూజిలాండ్ పర్యటనకు ముందు మరో రంజీ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మొహమ్మద్ సిరాజ్ తన జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాలని పట్టుదలగా ఉన్నాడు. త్రిపుర బలహీన జట్టు కావడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగుల స్కోరు కూడా విజయానికి సరిపోయింది. ఒక్క సెంచరీ కూడా లేకపోగా, ఇద్దరే అర్ధ సెంచరీలు సాధించారు. అయితే బౌలింగ్ పదునుతో జట్టు మ్యాచ్ నెగ్గింది. గత మ్యాచ్‌లో కర్నాటకపై 418 పరుగుల భారీ స్కోరుతో సత్తా చాటిన ఆంధ్ర ఇప్పుడు సొంతగడ్డపై తొలి విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు న్యూ చండీగఢ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున బరిలోకి దిగడం ఖాయమైంది. -
హైదరాబాద్ మహిళల టి20 జట్టు కెప్టెన్‌గా ప్రణవి చంద్ర
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ మహిళల టి20 ఎలీట్ టోర్నీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ టీమ్‌కు వెలగపూడి ప్రణవి చంద్ర కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ ఎం.మమతను ఎంపిక చేశారు. మహారాష్ట్రలోని పుణేలో ఈ నెల 26 నుంచి టోర్నమెంట్ జరుగుతుంది. గతంలో హైదరాబాద్ టీమ్‌కు మూడేళ్లు ఆడిన తర్వాత సౌత్‌జోన్ టీమ్‌కు ఎంపికైన ప్రణవి కేరళ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించింది. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు ఇంగ్లండ్‌లో ఈలింగ్, బిషప్ స్ట్రాట్ఫోర్ట్ జట్ల తరఫున ప్రణవి క్లబ్ క్రికెట్ కూడా ఆడింది. హైదరాబాద్ జట్టు: ప్రణవి చంద్ర (కెప్టెన్), ఎం.మమత (వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, ధ్రుతి కేసరి, ఎస్. యషశ్రీ, వంకా పూజ, సంధ్య గోరా, కుంచల నితీశ, ఎం.సాక్షి రావు, కావ్యశ్రీ, ఎడ్ల సృజన, నల్లా క్రాంతి రెడ్డి, కె.నిధి, పి.పార్వతి, తాటి కృష్ణవేణి. -
టీ20 ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ప్రణవి
బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్ 2026-27 సీజన్ కోసం హైదరాబాద్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ప్రణవి చంద్ర వెలగపూడి వ్యవహరించనుండగా.. వికెట్ కీపర్ ఎం.మమత వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఈ టోర్నీ అక్టోబర్ 26 నుంచి మహారాష్ట్రలోని పుణేలో జరుగనుంది.సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టు..ప్రణవి చంద్ర వెలగపూడి (కెప్టెన్), ఎం మమత (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, దృతి కేసరి, ఎస్ యశశ్రీ, పూజా వంక, సంధ్యా గోరా, కుంచాల నితీషా, ఎం సాక్షి రావు, కావ్య శ్రీ, ఎడ్ల సృజన, క్రాంతి రెడ్డి నల్లా, కె నిధి, ఆ పల్లయ్య కృష్ణ, పల్లకీ నిధి.స్టాండ్ బైస్: వై త్రిష పూజిత, కట్టా శ్రీవల్లి, శ్రీ బిల్వికా రెడ్డి, ఎం శివాని గౌడ్ మరియు మేహా లక్ష్మి ఈడిగ.ఇదీ చదవండి: న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన -
భారత అండర్–19 జట్టులో యశ్వీర్ గౌడ్
న్యూఢిల్లీ: శ్రీలంకలో వచ్చే నెలలో పర్యటించే భారత అండర్–19 పురుషుల క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ ఊట్కూరు యశ్వీర్ గౌడ్ ఎంపికయ్యాడు. యశ్వీర్ గౌడ్ తల్లిదండ్రులు ఊట్కూరు రాజ్‌కుమార్ గౌడ్, వాణి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యశ్వీర్ ఎనిమిదేళ్ల ప్రాయంలో బంతి పట్టాడు.విద్యానగర్‌లోని డేనియల్ క్రికెట్ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్న యశ్వీర్ ప్రస్తుతం కోచ్ కృష్ణమోహన్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. గత ఏడాది హైదరాబాద్ జట్టు తొలిసారి వినూ మన్కడ్ బీసీసీఐ అండర్–19 ట్రోఫీ టైటిల్ నెగ్గడంలో యశ్వీర్ కీలకపాత్ర పోషించాడు. యశ్వీర్ ఈ టోర్నీలో 15 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల తెలంగాణ టి20 లీగ్‌లో హైదరాబాద్ ఫ్రాంచైజీ యశ్వీర్ను రూ. 3 లక్షలకు సొంతం చేసుకుంది. మరోవైపు భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ కూడా శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి ఎంపికయ్యాడు. మరోవైపు స్వదేశంలో శ్రీలంక అండర్–19 మహిళల జట్టుతో జరిగే వన్డే, టి20 సిరీస్‌లో పాల్గొనే భారత అండర్–19 జట్టులో ఆంధ్ర వికెట్ కీపర్ కె.దీక్ష చోటు దక్కించుకుంది. 15 మంది సభ్యులతో కూడిన భారత వన్డే, టి20 జట్లకు భవిక అహిరె కెప్టెన్‌గా వ్యవహరించనుంది. -
అభిరథ్ రెడ్డి, హిమతేజ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌తో జింఖానా మైదానంలో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 56/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 105 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (121; 16 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ కొడిమెల హిమతేజ (125 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలు సాధించారు. అమన్ రావు (52; 8 ఫోర్లు, 1 సిక్స్)తో తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించిన అభిరథ్... మూడో వికెట్‌కు హిమతేజతో 147 పరుగులు జత చేశాడు. ప్రజ్ఞయ్ రెడ్డి (52 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ ఐదో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆంధ్ర 267/5 నాగాలాండ్ జట్టుతో సొవిమాలో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో... రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (51; 7 ఫోర్లు), కరణ్ షిండే (51; 5 ఫోర్లు, 1 సిక్స్), సీఆర్ జ్ఞానేశ్వర్ (87 బ్యాటింగ్; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 366కు ఆంధ్ర మరో 99 పరుగుల దూరంలో ఉంది. జ్ఞానేశ్వర్‌తో కలిసి శశికాంత్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. -
సర్ఫరాజ్, సిద్ధేశ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: సర్ఫరాజ్ ఖాన్ (142 బ్యాటింగ్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (104; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘శత’క్కొట్టారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఓపెనర్లు అఖిల్ (27), ఆకాశ్ ఆనంద్ (35)లతో పాటు ముషీర్ ఖాన్ (11) విఫలమయ్యారు. 82/3తో కష్టాల్లో పడ్డ ముంబైను సిద్ధేశ్, సర్ఫరాజ్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 249 పరుగులు జత చేశారు. తొలి రోజు ఆట ముగుస్తుందనగా సిద్ధేశ్ అవుటయ్యాడు. హిమాన్షు (0 బ్యాటింగ్)తో కలిసి సర్ఫరాజ్ క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు రెండు వికెట్లు పడగొట్టగా... సిరాజ్, నితిన్ సాయి యాదవ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. -
SMAT: సూపర్ లీగ్‌కు హైదరాబాద్, ఆంధ్ర జట్లు
దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సూపర్ లీగ్ దశకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్‌లలో ఓడినా... ఈ రెండు టీమ్‌లు ముందంజ వేయడంలో సఫలమయ్యాయి. గ్రూప్ ‘బి’లో ఆడిన 7 మ్యాచ్‌లలో 5 గెలిచి, 2 ఓడిన హైదరాబాద్ మొత్తం 20 పాయింట్లతో అగ్ర స్థానం సాధించగా, గ్రూప్ ‘ఎ’లో ఆడిన 7 మ్యాచ్‌లలో 5 గెలిచి, 2 ఓడిన ఆంధ్ర 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫై అయ్యాయి.సోమవారం జరిగిన చివరి లీగ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో చండీగఢ్ చేతిలో పరాజయం పాలైంది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్ రెడ్డి (43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అమన్ రావు (33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తనయ్ త్యాగరాజన్ (27; 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం చండీగఢ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు సాధించింది. సత్యనారాయణ రాజుకు 4 వికెట్లువిదర్భతో లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 19 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా విదర్భ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమన్ మోఖడే (35 బంతుల్లో 50; 7 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (41; 2 సిక్స్‌లు) రాణించగా... ఆంధ్ర బౌలర్ సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. పైలా అవినాశ్ (44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (26; 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. యశ్ ఠాకూర్ 4 వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు. పుణేలో ‘సూపర్ లీగ్’ మ్యాచ్లుటోరీ్నలో భాగంగా ‘సూపర్ లీగ్’ దశకు చేరిన 8 జట్లను 2 గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్లతో ఆంధ్ర తలపడనుండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, రాజస్తాన్, హరియాణాలతో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్‌లు వరుసగా ఈ నెల 12, 14, 16 తేదీల్లో జరుగుతాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు 18న ఫైనల్లో తలపడతాయి. ‘సూపర్ లీగ్’ మ్యాచ్‌లు పుణేలో నిర్వహిస్తారు.చదవండి: SMAT 2025: సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం -
పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్.. ఐపీఎల్ జట్లకు సందేశం!
భారత క్రికెటర్, మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 23 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. పృథ్వీకి తోడు మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి భారీ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. ఫలితంగా మహారాష్ట్ర.. హైదరాబాద్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దేశవాళీ టీ20 టోర్నరమెంట్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో భాగంగా ఎలైట్ గ్రూప్-‘బి’లో ఉన్న మహారాష్ట్ర- హైదరాబాద్ (Hyderabad vs Maharashtra) శుక్రవారం తలపడ్డాయి. కోల్‌కతా వేదికగా జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ స్టేడియంలో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకుంది.రాణించిన హైదరాబాద్ బ్యాటర్లుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (12), అమన్ రావు (11) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ ప్రజ్ఞయ్ రెడ్డి (17 బంతుల్లో 26), రాహుల్ బుద్ధి (31) ఓ మోస్తరుగా రాణించారు.మిగిలి వారిలో భవేశ్ సేత్ (19) విఫలం కాగా.. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 32), కెప్టెన్ సీవీ మిలింద్ (20 బంతుల్లో 35 నాటౌట్), మొహ్మద్ అర్ఫాజ్ అహ్మద్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్ సక్సేనాకు రెండు, ఆర్ఎస్ హంగ్రేగ్కర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్ ఒక్కో వికెట్ తీశారు.దుమ్ములేపిన ‘మహా’ ఓపెనర్లుఇక హైదరాబాద్ విధించిన 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ పృథ్వీ షా (Prithvi Shaw) 23 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 36 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు.మరోవైపు... అర్షిన్ కులకర్ణి సైతం ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని.. పన్నెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అజిమ్ కాజీ (8) విఫలం కాగా.. రాహుల్ త్రిపాఠి 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి అర్షిన్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఐపీఎల్ జట్లకు సందేశం!కాగా సచిన్ టెండుల్కర్ స్థాయికి చేరుకుంటాడంటూ నీరాజనాలు అందుకున్న పృథ్వీ షా.. అనతికాలంలోనే టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు. దేశీ క్రికెట్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఫిట్నెస్ లేమి, క్రమశిక్షణా రాహిత్యం కారనంగా ఆటపై దృష్టి పెట్టలేకపోయిన పృథ్వీ షాను గతేడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.ఫలితంగా పృథ్వీ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. తర్వాత సొంత జట్టు ముంబైని కూడా వీడి.. ఈ దేశీ సీజన్ ఆరంభంలోనే మహారాష్ట్రతో చేరాడు. తన తప్పుల్ని తెలుసుకుని ఆటపై దృష్టి సారించానన్న పృథ్వీ.. ఫార్మాట్లకు అతీతంగా అదరగొడుతున్నాడు. తాజా ప్రదర్శనతో ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలకు తానూ రేసులో ఉంటాననే సందేశం ఇచ్చాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు -
SMAT: తిలక్ వర్మ కాదు!.. హైదరాబాద్ కెప్టెన్‌గా అతడే
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో పాల్గొనే హైదరాబాద్ సీనియర్ జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. పదిహేను మంది సభ్యుల ఈ టీమ్‌కు సీవీ మిలింద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కుమారుడే ఈ మిలింద్ అన్న విషయం తెలిసిందే. ఇకఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఉన్న హైదరాబాద్ తమ మ్యాచ్‌లన్నీ కోల్‌కతాలోనే ఆడుతుంది. ఏడు లీగ్ మ్యాచ్‌ల్లో మూడు ఈడెన్ గార్డెన్స్‌లో, నాలుగు జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్లో జరుగుతాయి. తొలి పోరులో ఈ నెల 26న మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఈ గ్రూప్‌లో మరో ఆరు జట్లు మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్, బిహార్, చండీగఢ్ ఉన్నాయి.తిలక్ వర్మ బిజీబిజీఇదిలా ఉంటే.. ఈ దేశీ టీ20 టోర్నీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ గతేడాది హైదరాబాద్ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేపథ్యంలో తిలక్ జాతీయ జట్టు విధుల్లో బిజీగా గడుపనున్నాడు. ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో మిలింద్కు హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో నవంబరు 22 నుంచి డిసెంబరు 19 మధ్య టీమిండియా సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి హైదరాబాద్ జట్టు సీవీ మిలింద్ (కెప్టెన్), తనయ్ త్యాగరాజన్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, అమన్ రావు, హెచ్‌కే సింహా, ఆశిష్ శ్రీవాత్సవ, నితేశ్ కనాల, అజయ్‌దేవ్ గౌడ్, ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), భవేశ్ సేఠ్ (వికెట్ కీపర్), నితిన్ సాయి యాదవ్, రక్షణ్ రెడ్డి, ఎండీ అర్ఫాజ్, రిషికేత్ సిసోడియా, రాహుల్ బుద్ధి. చదవండి: వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి -
Buchi Babu Trophy: హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం.. టేబుల్ టాపర్‌గా
చెన్నై: బ్యాటర్లు విజృంభించడంతో బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 59 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను చిత్తుచేసింది. దీంతో గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన హైదరాబాద్ 19 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. తన్మయ్, వరుణ్ సెంచరీలుమధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ కాగా... హైదరాబాద్ 87 ఓవర్లలో 414/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తన్మయ్ అగర్వాల్ (162 బంతుల్లో 130; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (110 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (100 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో రోహిత్ రజావత్ 3... అన్వేశ్, విష్ణు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. సక్షమ్ పురోహిత్ (121 బంతుల్లో 78; 4 ఫోర్లు), ఆర్యన్ తివారి (91 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధశతకాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రైమ్ వాలీబాల్ లీగ్సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ పోటీలకు రంగం సిద్ధమైంది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 2 నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్ సహా మొత్తం 38 మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహిస్తారు. పీవీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో క్రీడలపై అభిమానులకు చాలా ఆసక్తి ఉందని, ఇదే క్రమంలో వాలీబాల్ లీగ్ కూడా పెద్ద స్థాయిలో విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. టోర్నీ సమర్థ నిర్వహణకు తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీబాలాదేవి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు లీగ్‌లో పాల్గొంటున్న హైదరాబాద్ హాక్స్ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు.


