
తన్మయ్, వరుణ్
చెన్నై: బ్యాటర్లు విజృంభించడంతో బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 59 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను చిత్తుచేసింది. దీంతో గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన హైదరాబాద్ 19 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది.
తన్మయ్, వరుణ్ సెంచరీలు
మధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ కాగా... హైదరాబాద్ 87 ఓవర్లలో 414/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తన్మయ్ అగర్వాల్ (162 బంతుల్లో 130; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (110 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (100 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు.
మధ్యప్రదేశ్ బౌలర్లలో రోహిత్ రజావత్ 3... అన్వేశ్, విష్ణు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. సక్షమ్ పురోహిత్ (121 బంతుల్లో 78; 4 ఫోర్లు), ఆర్యన్ తివారి (91 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధశతకాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రైమ్ వాలీబాల్ లీగ్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ పోటీలకు రంగం సిద్ధమైంది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 2 నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్ సహా మొత్తం 38 మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహిస్తారు. పీవీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో క్రీడలపై అభిమానులకు చాలా ఆసక్తి ఉందని, ఇదే క్రమంలో వాలీబాల్ లీగ్ కూడా పెద్ద స్థాయిలో విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. టోర్నీ సమర్థ నిర్వహణకు తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీబాలాదేవి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు లీగ్‌లో పాల్గొంటున్న హైదరాబాద్ హాక్స్ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు.