
అభ్యంతరకర ఏఐ చిత్రం పోస్టు చేశాడని..
దమోహ్ జిల్లాలో యువకుడిపై దాష్టీకం
దమోహ్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించిన ఒక ’అభ్యంతరకరమైన’ చిత్రాన్ని పంచుకున్నందుకు మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో ఒక యువకుడిని బ్రాహ్మణుడి కాళ్లు కడిగించి.. ఆ నీటిని తాగమని బలవంతం చేశారన్న ఆరోపణలపై ఆదివారం పోలీసు కేసు నమోదైంది. జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని పతేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సతరియా గ్రామంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు
తెలిపిన వివరాలివి.
చెప్పుల దండ వేసినట్లు ఏఐ చిత్రం
ఓబీసీ వర్గానికి చెందిన పురుషోత్తం కుషా్వహా, అదే గ్రామానికి చెందిన అన్నూ పాండే అనే వ్యక్తికి చెప్పుల దండ వేసినట్లు ఏఐ రూపొందించిన చిత్రాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో కుష్వాహా ఆ పోస్ట్‌ను తొలగించి, బహిరంగంగా క్షమాపణ చెప్పాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రుత్ కీర్తి సోమ్‌వంశీ తెలిపారు. అనంతరం గ్రామంలో పంచాయతీ నిర్వహించి కుషా్వహాతో బలవంతంగా పాండే కాళ్లు కడిగించి.. అదే నీటిని అతనితో తాగించారు. పంచాయతీ అతనికి రూ.5,100 జరిమానా కూడా విధించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో వీడియోలో, కుష్వాహా మాట్లాడుతూ.. తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పానని, ఈ సంఘటన రాజకీయ అంశంగా మారాలని కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నట్లు ఉంది. కాగా, బాధితుడు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, పాండేతో సహా నలుగురిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 196 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు దమోహ్ కలెక్టర్ సు«దీర్ కుమార్ కోచర్ విలేకరులకు తెలిపారు.
నిందితులను అరెస్టు చేసే ప్రక్రియ జరుగుతోందని ఎస్పీ తెలిపారు. ఈ సంఘటన మానవత్వంపై మచ్చని కాంగ్రెస్ పార్టీ ’ఎక్స్’లో పేర్కొంది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ప్రతి నేరాన్నీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు.