
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న ‘మానసిక ఆరోగ్య దినోత్సవా’న్ని (World Mental Health Day 2025) జరుపు కొంటున్నాము. మానసిక ఆరోగ్య ప్రాము ఖ్యాన్ని గుర్తించి ‘వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్’ (డబ్ల్యూఎఫ్‌ఎమ్‌హెచ్) 1992 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశా లలో మానసిక ఆరోగ్యంపై అపోహలు తొలగించి అవగాహన పెంచడానికి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘విపత్తులు, ఆపత్కాలంలో మానసిక ఆరోగ్య సేవల లభ్యత’ అనేది ఈ ఏడాది నినాదం.
‘శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా, సామాజికంగా కూడా దృఢంగా ఉండటం’ సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్వచనం. మనిషి తన ఆలోచనలు, భావోద్వేగాలు నియంత్రించుకోగలిగి, సమస్యలను ధైర్యంగా ఎదు ర్కొని, సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. డబ్ల్యూహెచ్‌ఓ అంచనా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 97 కోట్లకు పైగా ప్రజలు, రకరకాల మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నారు. మన దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక ఇబ్బందికి గురవుతున్న వారే! డిప్రెషన్, ఆందోళన, మద్యపానం, మాదక ద్రవ్యాల విని యోగం వల్ల ఎక్కువమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, తొక్కిసలాటల్లో వందలాది మరణాలు సంభవించడం, కోవిడ్ లాంటి సందర్భాలలో అచటి ప్రజలు మరింత మానసిక క్షోభకు గురవుతారని పరి శోధనల్లో తేలిన విషయం. కోవిడ్ ప్రపంచానికి ఒక పెద్దపాఠం నేర్పింది. చావు భయంతోపాటు, లాక్‌డౌన్ ప్రభావం, ఉద్యోగాలు పోయి ఆర్థిక ఇబ్బందులు, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఒంటరిగా ఉండటం లాంటివన్నీ మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపాయి. ఒక అంచనా ప్రకారం, కోవిడ్‌లో మానసిక రుగ్మతలు కనీసం 25 శాతం పెరిగాయి. యువతలో మొబైల్ అడిక్షన్, డిప్రెషన్, గ్యాంబ్లింగ్ సమస్యలు అధికమయ్యాయి.
రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్–గాజా యుద్ధాల వల్ల అక్కడి ప్రజలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సర్వేలు తెల్పు తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వంటి చోట్ల ఆ మధ్య సంభవించిన మేఘ విస్ఫోటనం వల్ల వచ్చిన వరదలు, ఆస్తి, ప్రాణనష్టంతో అనేకమంది మానసిక వేదనకు గురయ్యారు. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా గల మన దేశంలో కనీసం 20 వేల మంది అర్హులైన మానసిక వైద్య నిపుణులు కూడా లేరంటే ఆశ్చర్యమే! మానసిక ఆరోగ్యానికి హెల్త్ బడ్జెట్‌లో కేటాయింపులు కేవలం ఒక శాతం కన్నా తక్కువే!
చదవండి: Mounjaro వెయిట్‌లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!
ఈ సమస్యల నుండి బయటపడాలంటే, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థతో, మానసిక ఆరోగ్య సేవలను అనుసంధానించాలి. కళాశా లల్లో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెంటల్ హెల్త్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విపత్తులలో పనిచేసే సిబ్బందికి ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో శిక్షణ ఇప్పించాలి. హెల్ప్‌లైన్‌లు, టెలిమానస్ లాంటి సర్వీసులు మరింతగా పెంచాలి. ఆపద సమయాల్లో మన మిచ్చే ఓదార్పు, భరోసా, భవిష్యత్తులో వారు మరిన్ని మానసిక రుగ్మతలకు లోనుకాకుండా నివారిస్తుంది. మానసిక వైద్యుల కొరత ఉన్న మన దేశంలో, ఇలాంటివి ఎదుర్కొనేందుకు ఆశా, హెల్త్ వర్కర్లు; ఎన్‌ఎస్‌ఎస్, రెడ్‌క్రాస్ కార్యకర్తలు; టీచర్లు, మత ప్రతి నిధులు లాంటి వారికి, ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో తగిన శిక్షణ నివ్వాలి. అప్పుడే 2047 నాటికి మనం పరిపూర్ణ ‘వికసిత్ భారత్’ని సాధించగలుగుతాం.
ఇదీ చదవండి: చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!
వ్యాసకర్త డా.ఇండ్లరామసుబ్బా రెడ్డి
మానసిక వైద్య నిపుణులు
(అక్టోబర్ 11 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం)