
లద్దాఖీయుల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న విద్యావేత్త, గాంధేయవాది సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయడంతో ఆయన ప్రభావం మరింతగా పెరిగింది.
విశ్లేషణ
స్వతంత్ర భారతదేశం పలు పునర్విభజనలతో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడటాన్ని చూసింది. ఈ మార్పులు దేశంలోని బహుళ సాంస్కృతిక, బహుళ జాతుల సంక్లిష్టతలను ప్రతి బింబింపజేశాయి. లద్దాఖ్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న అశాంతి, సార్వభౌమాధి కారాన్ని పంచుకునేందుకు చేస్తున్న సాధారణ వక్కాణింపు కాదు. వారు స్వతంత్ర ప్రతిపత్తిని ఆకాంక్షిస్తున్నారు. జమ్ము–కశ్మీర్‌ను విభజించిన తర్వాత, 2019లో లద్దాఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంత (యూటీ) హోదా కల్పించారు. అయితే, తమ హక్కుల పరిరక్షణను కోరుతూ లద్దాఖీయులు 2021 డిసెంబర్‌లో తిరిగి వీధులకెక్కారు.
లద్దాఖ్ ఎందుకు కీలకం?
లద్దాఖ్ ఒక శీతల ఎడారి. దాని గణనీయమైన ప్రాంతం చైనా, పాకిస్తాన్‌ల ఆక్రమణలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణరంగం సియాచిన్ హిమనదం ఈ ప్రాంతం లోనిదే. వ్యూహ పరంగా లద్దాఖ్‌కు ఉన్న ప్రాధాన్యం, పొరుగునున్న రెండు శత్రు దేశాల ఉనికి వల్ల భారత్ అప్రమత్తంగా మెలగుతూ, అక్కడ సత్పరి పాలనకు బాధ్యత వహించవలసి ఉంది. ఉపాధి అవకాశాలను తగినంతగా పెంపొందించే విధంగా దాని ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంద కపోతే, ఆ ప్రాంత పౌరుల్లో అసంతృప్తి, అశాంతి కొనసాగుతూనే ఉంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారతదేశపు భద్రతను, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అది విఘాతంగా పరిణమించవచ్చు.
అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయటడంలో లద్దాఖ్ నైసర్గిక స్వరూపం అధికారులకు సవాల్‌గా పరిణమిస్తోంది. లద్దాఖ్ ఇంత సంక్లిష్టమైనదిగా మారడానికి చారిత్రక కారణాలున్నాయి. డోగ్రా రాజు గులాబ్ సింగ్‌కు చెందిన సేనాపతి జోరావర్ సింగ్ 1834 –35లో ఈ ప్రాంతాన్ని జయించారు. జమ్ము–కశ్మీర్ అంశం వివాదంగా మారినపుడు, ఆ పెద్ద వివాదంలో లద్దాఖ్ చిక్కుకుంది. భారత సైన్యం 1947లో ప్రతిదాడులు చేపట్టి, ద్రాస్, కార్గిల్, లేహ్‌ల నుంచి చొరబాటుదారులను తరిమేయడంతో, జమ్ము–కశ్మీర్‌లోని మూడు పాలిత విభాగాల్లో లద్దాఖ్ ఒకటిగా రూపుదాల్చింది.
నిరసనలకు కారణాలు
లద్దాఖ్ చాలా కాలం అభివృద్ధికి నోచుకోలేదు. పేలవమైన ఆరోగ్య సేవలతో మరణాల రేటు అధికంగా ఉంటూ వచ్చింది. ఉపాధి అవకాశాలు వ్యవసాయానికి, ప్రభుత్వ రంగానికి, చాలా కాలం తర్వాత టూరిజానికి పరిమితమయ్యాయి. దాంతో ప్రభుత్వంపై లద్దాఖ్‌కు పేచీ తలెత్తింది. తమ సొంత ప్రతినిధుల చేతిలో అధికారం ఉంటేనే, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అందుకే, 2024 ఫిబ్రవరిలో నిరసనలు తలెత్తడం ఆశ్చర్యం కలిగించలేదు. అవి లేహ్, కార్గిల్‌లను ఏకం చేశాయి. ఇంజినీర్, విద్యావేత్త, గాంధేయవాది అయిన సోనమ్ వాంగ్‌చుక్ నాయకత్వ పాత్రను ధరించారు. వాంగ్‌చుక్ నూతన తరహా పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని హిందీ సినిమా ‘3 ఇడియట్స్’ రూపొందడంతో, ఆయన ఇదివరకే ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయన నిరాహార దీక్షకు కూర్చుని, శ్రేయోభిలాషుల సలహా మేరకు, 21 రోజుల తర్వాత దాన్ని విరమించుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇసుమంత కూడా మార్చుకోలేదు.
ఆయన గత నెలలోనూ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. లేహ్‌లో హింసాయుత ఘటనలు చోటుచేసుకోవడంతో, మళ్ళీ విరమించుకున్నారు. తదనంతరం, ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, జోధ్‌పూర్ జైలుకు తరలించారు. చర్చలతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. కానీ, ఆ ప్రక్రియలో వాంగ్‌చుక్‌కు పాత్ర కల్పించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. కాల్పుల్లో నలుగురు నిరసనకారులు మరణించిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వాంగ్‌చుక్ కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ హోదా, లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ల విషయంలో లేహ్ అపెక్స్ బాడీకి, కార్గిల్ డెమొక్రాటిక్ అలయ¯Œ ్సకు తన మద్దతును పునరుద్ఘాటించారు.
రాష్ట్ర హోదా వచ్చేనా?
జమ్ము–కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నపుడు లద్దాఖ్ నుంచి శాసన సభలో నలుగురు సభ్యులు, ఒక లోక్‌సభ సభ్యుడు ఉండే వారు. ఈ ప్రాతినిధ్యం తగినంతగా లేదనే భావన అప్పుడూ ఉంది. ఈ ప్రాంతం, ప్రజల పట్ల అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రజాస్వామిక, ప్రాతినిధ్య పరిపాలనను పటిష్ఠ పరచేందుకు లేహ్‌కు (1995లో), కార్గిల్‌కు (2003లో) లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళను జమ్ము– కశ్మీర్ ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. కానీ, ఇది క్షేత్ర స్థాయిలో పరిస్థితులలో మార్పు వచ్చేందుకు తోడ్పడలేకపోయింది.
2019 ఆగస్టు 5న, 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో కేంద్రపాలిత ప్రాంత హోదా డిమాండ్ నెరవేరిందికానీ, అవకాశా లను అది పరిమితం చేసింది. పాలనా యంత్రాంగంలోకి తీసుకునేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటిదేమీ లేకపోవడం వల్ల కేంద్ర పాలిత హోదా ఎక్కువ ఉద్యోగావకాశాలను చూపలేకపోయింది.
దాదాపు 3 లక్షల జనాభా కలిగిన లద్దాఖ్ వ్యవస్థాగతంగా బలహీనంగా ఉంది. యూటీ అనిపించుకున్నా వనరులపై హక్కులు ఉండవు కనుక, అది రాష్ట్ర హోదాను కోరుకుంటోంది. అధికార కేంద్రీకరణకు మొగ్గు చూపే బీజేపీ కేంద్రంలో గద్దెపై ఉండటం వల్ల, రాష్ట్ర హోదా మంజూరు కుదిరే పని కాదని చెప్పవచ్చు.
వ్యాపార వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతుందనీ, బయటి ప్రాంతాల కార్మికులు ఉన్న కొద్ది పాటి అవకాశాలను ఎగరేసుకుపోతారనీ ఈ ప్రాంతంలో భయాందో ళనలు ఉన్నాయి. అందుకే, తమను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యులులో చేర్చాలనీ, రాష్ట్ర హోదా కల్పించాలనీ అడుగుతున్నారు. లద్దాఖ్‌కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండు పార్లమెంట్ సీట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, రాజకీయ ప్రాతినిధ్య పెంపునకు పురిగొల్పే విధంగా ప్రత్యేక రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని లద్దాఖ్ ప్రజానీకం చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదే!
అజయ్ కె. మెహ్రా
వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ మల్టీ లెవెల్ ఫెడరలిజం’లో
విజిటింగ్ సీనియర్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)