
ఎవరో ఏదో చెప్పారని, అశాస్త్రీయమైన వైద్య విధానాల్ని, పద్ధతుల్ని అవలంబించేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నడుం నొప్పిని తట్టుకోలేక చైనాకు చెందిన ఒక వృద్ధురాలు పాత ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విషయం ఏమిటంటే..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్‌తో బాధపడుతోంది . ఈ బాధను భరించలేక బతికున్న కప్పలను మింగేసింది.ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిందింటిని మింగింది. ఇలా సజీవ కప్పలను మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్మి ఇలాచేసినట్టు తెలుస్తోంది.
నడుం నొప్పి తగ్గలేదు సరికదా, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి పాలైంది. విషయం తెలిసి వైద్యులే నివ్వెర పోయారు. చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్‌తో బాధపడుతున్న జాంగ్, అసలు విషయం చెప్ప కుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యులను కోరింది. ఇలా మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పలను సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యులను సంప్రదించారు. వైద్యుల ప్రకారం ఆమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్‌వార్మ్ లార్వా స్పార్గానమ్‌తో సహా, ఇతర బాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో రెండు వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సజీవంగా కప్పలను మింగడం వల్ల రోగి జీర్ణవ్యవస్థ దెబ్బతిని, పరాన్నజీవులు చేరాయి ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.
నోట్ : ఆరోగ్య చిట్కాలు చిట్కాలు మాత్రమే అని గమనించాలి.అవి పరిష్కారం ఎంతమాత్రం కావు. అందులోనూ సుదీర్ఘ కాలంలో బాధపడుతున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే మొదటికే మోసం రావచ్చు.