
చీరమీను..అరుదైన ఒక రకం చిట్టిచేప. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని యానం ప్రాంతంలో దొరికే ఒక ప్రత్యేకమైన, అత్యంత విలువైన చేప. ఈ చిన్న చేప చక్కని రుచి, పోషకాలతో కూడినది. సీజన్‌లో దొరుకుతుంది. ప్రత్యేక వేట పద్ధతులకు ప్రసిద్ధి చెందింది. చీరమీను స్థానికులకు మాత్రమే కాక, సీ ఫుడ్ ప్రియులకు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
స్థానిక పేర్లు: చీరమీను, సీరమీను. శాస్త్రీయ నామం: auridatumbil, Sauridatumbil, Sauridagracilis, Sauridatumbil ambo scamis. Synodontidae. దీన్ని కొందరు Awaousfluviatilisఅని కూడా సూచిస్తారు.
చీరతో పట్టే చేప
చీరమీను ప్రధానంగా గోదావరి నది – సముద్రం కలిసే బురద నీటిలో దొరుకుతుంది. ఈ ్ర΄ాంతంలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఈ చేపలు గుడ్లు పెడతాయి. వర్షాకాలం సీజన్‌లో తూర్పు గాలులు వీస్తే, ఈ చేపలు నది ఒడ్డుకు చేరతాయి. వాటి రాకను పక్షులు గమనించి వాటిని తినడానికి నీటిపై ఎగురుతాయి. పక్షుల హడావుడి చూసి మత్స్యకారులు ‘చీరమీను వస్తోంది’ అని గుర్తిస్తారు. చీరమీను వేట ఒక సాంప్రదాయ ప్రక్రియ. మత్స్యకారులు చీరలకు ఒకవైపున షీట్లు కుట్టి వాటిని నీటిలో అమరిస్తారు. చేపలు వాటిలో చిక్కుకుంటాయి. చిన్న వలలు ఉపయోగించకుండా ఈ చేపలను చీరలతోనే సురక్షితంగా పట్టుకుంటారు. చీరలను ఉపయోగించి పడవలో వెళ్లి పట్టుకుంటారు కాబట్టి ‘చీరమీను’ అని పేరుపెట్టారు. ఈ చేప 1.7 సెంటీమీటర్లు వరకు పెరుగుతుంది.
చీరమీను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లభిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. దీపాళి, నాగుల చవితి వంటి పండుగల సమయానికి చీరమీను మార్కెట్లలో అత్యధిక డిమాండ్‌లో ఉంటుంది. ఈ సీజన్‌లోనే స్థానికులు, ఆహార ప్రేమికులు దీన్ని ఆస్వాదిస్తారు. మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, నియాసిన్, సెలీనియం, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు చీరమీను చేపల్లో పుష్కలంగా ఉంటాయి.
ఇదీ చదవండి:
కిలో రూ. 1,500!
చీరమీను అరుదుగా దొరుకుతుంది. వేట శ్రమతో కూడినది. కాబట్టి, మార్కెట్‌లో అధిక ధర పలుకుతుంది. దీన్ని గ్లాసు, తవ్వ, సేరు, కుంచం, బిందె, బకెట్లలో కొలిచి విక్రయిస్తారు. ఒక గ్లాసు చీరమీను చేపల ధర సుమారు రూ. 50–100. ఒక కుండి లేదా పెద్ద పాత్ర చేపల ధర రూ.10,000 వరకు ఉంది. కిలో ధర: రూ.500 – 1,500 (డిమాండ్‌ను బట్టి) పలుకుతుంది. ఇందువల్ల ఇది ఒక విలాసవంతమైన వంటకంగా మారింది. చీరమీను మాత్రమే కాక, దీని పిల్లలు కూడా ఫ్రాన్స్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతాయి.
ఇదీ చదవండి: నో అన్న గూగుల్‌లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
మసాలా దట్టించి వండిన చీరమీను చక్కటి రుచి ఉంటుంది. కొంతమంది చీరమీను మినప్పిండి, చింత చిగురు, మామిడి కాయ, గోంగూర వంటి ఇతర పదార్థాలతో కలిపి వంటలు తయారు చేస్తారు. స్థానికులు పండుగల సమయంలో బంధు మిత్రులకు దీన్ని బహుమతిగా ఇచ్చి ఆనందిస్తారు. గోదావరి మడ అడవుల ప్రాంతంలో అధికంగా వేటాడటం, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చీరమీను మనుగడ ప్రమాదంలో పడింది. కాలుష్య నియంత్రణ, మత్స్యసంఘాల అవగాహన ద్వారా సురక్షిత వేట పద్ధతులను పాటిస్తే చేపల జాతిని పరిరక్షించుకోవచ్చు. తద్వారా జీవవైవిధ్యాన్ని, గోదావరి ప్రాంతపు సాంస్కృతిక, ఆర్థిక వారసత్వాన్ని నిలుపు కోవచ్చు. భవిష్యత్ తరాలకు దీన్ని రుచి చూపవచ్చు. చీరమీను కేవలం ఒక చేప మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో సాంప్రదాయం, జీవనోపాధి, వంటకాల సంపద పర్యావరణ సూచికగా ప్రసిద్ధి చెందింది. ప్రతి వర్షాకాలం సీజన్‌లో గోదావరి ప్రాంతానికి వచ్చే పర్యాటకులు దీని రుచిని ఆస్వాదించడానికి ఇష్టపడతారు.
-పొన్నపల్లి రామమోహన్ రావు (9885144557), డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ఫిషరీస్ (రిటైర్డ్),
కాకినాడ