షీ టీమ్‌ చెప్తున్న రక్షణ పాఠాలు | Hyderabad She Teams actively work to ensure womens safety | Sakshi
Sakshi News home page

షీ టీమ్‌ చెప్తున్న రక్షణ పాఠాలు

Jan 9 2026 4:08 AM | Updated on Jan 9 2026 4:08 AM

Hyderabad She Teams actively work to ensure womens safety

భద్రత

గత డిసెంబర్‌ నెలలో షీ టీమ్‌ పోలీసులు జంట నగరాల్లో 90 కేసులు బుక్‌ చేశారు. స్త్రీలను పోకిరీలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, వారి భరతం ఎలా పట్టారో తెలుసుకుంటే మరింత జాగ్రత్తగా, ధైర్యంగా ఉండొచ్చు... నగరంలోగానీ, మరెక్కడైనా కానీ.

ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థిని ‘రాపిడో’ బుక్‌ చేసుకుంది. ఆ రాపిడో డ్రైవర్‌ ఆ విద్యార్థిని నంబర్‌ నోట్‌ చేసుకొని పదే పదే ఆమెకు ఫోన్‌ చేయసాగాడు. ఆ తర్వాత అశ్లీలమైన మెసేజ్‌లు చేస్తున్నాడు. అమ్మాయి ముందు ఆందోళన పడింది. ఆ తర్వాత ధైర్యం చేసి షీ టీమ్‌కు ఫోన్‌ చేసింది. ఇంకేముంది? కుర్రాడికి తగిన ‘మర్యాద’ జరిగింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 292 ప్రకాశం కేసు బుక్‌ అయ్యి నాంపల్లి కోర్టు ద్వారా ఆ పోకిరీకి 7 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది.

మరో అమ్మాయిని పక్కింటి ‘అంకుల్‌’ గారు ఫాలో అవుతున్నారు. రోజూ అమ్మాయి కాలేజీకి వెళుతుంటే వెనుక నడుస్తూ కాలేజీ దాకా వస్తున్నారు. అమ్మాయి ఈ విషయాన్ని షీ టీమ్‌కు చెప్పింది. షీ టీమ్‌ అంకుల్‌ గారి మీద కేసుగట్టి నాంపల్లి కోర్టులో ప్రవేశ పెడితే 7 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది.

ఇంకొక పెద్దమనిషి ఏం చేశాడంటే ఒక మహిళ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి ఆమె ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్‌ చేసి వాటితో ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి పని చాలా ఆందోళన కలిగించేదే. కాని ఆ మహిళ వెంటనే షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ పెద్దమనిషిని అరెస్ట్‌ చేశారు. కోర్టు జైలు శిక్ష విధించింది.

ఇవన్నీ డిసెంబర్‌ 2025 నెలలో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనలు. డిసెంబర్‌లో జంట నగరాల నుంచి మొత్తం 98 ఫిర్యాదులు షీ టీమ్‌కు వస్తే వాటిలో 14 ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 13 మందిని ఘటనా స్థలంలోనే పట్టుకున్నారు. అంటే ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే షీ టీమ్‌కు కాల్‌ చేయగానే వచ్చి పట్టుకున్నారన్న మాట. వీరిలో ఇద్దరు మైనర్‌లు ఉన్నారు. 

2025లో స్త్రీలకు సురక్షిత నగరాల సూచీలో హైదరాబాద్‌ 4వ స్థానంలో ఉంది. బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. స్త్రీల రక్షణ కోసం యాప్స్‌ ఉన్నాయి. షీ టీమ్స్‌ ఉన్నాయి. కావలసిందల్లా ... ‘‘వాళ్లు ఉన్నారు, వెంటనే స్పందిస్తారు’’– అనే చైతన్యం కలిగి ఉండటమే. విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యక్తిగత పనులు... వీటి కోసం నగరంలో బయట తిరిగేటప్పుడు, నివాసం ఉన్న చోటు ఇతరుల నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా చట్టం చురుగ్గా పని చేస్తుందనే ఎరుక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అదే సమయంలో ఇతరుల నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురు కావచ్చో తెలుసుకొని అలాంటివి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

అపరిచిత వ్యక్తులతో కాల్స్‌ మాట్లాడటం, వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వడం, సోషల్‌ మీడియాలో అవసరం లేని విషయాలు షేర్‌ చేసుకోవడం మంచిది కాదు. అలాగే ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మౌనంగా భరించడమూ మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వ రక్షణ వ్యవస్థల నుంచి వెంటనే సహాయం పొందే సంసిద్ధతను కలిగి ఉండాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement