
రోహిత్, కోహ్లి భవిష్యత్తుపై గంభీర్ వ్యాఖ్య
రాబోయే సిరీస్‌పైనే దృష్టి పెట్టామన్న హెడ్ కోచ్
న్యూఢిల్లీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సిరీస్ ఫలితంకంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ సిరీస్‌తోనే బరిలోకి దిగుతున్న వీరిద్దరు ఇప్పటికే రెండు ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అయి ఒక్క వన్డేలే ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈనేపథ్యంలో తాజా చర్చపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇప్పటికిప్పుడు వారిద్దరి భవిష్యత్తుపై తానేమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. ‘వన్డే వరల్డ్‌కప్‌కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కాబట్టి భవిష్యత్తుకంటే ప్రస్తుతంపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని నేను భావిస్తా. వారిద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు అనడంలో సందేహం లేదు. పునరాగమనం చేస్తున్న వారి అనుభవం ఆ్రస్టేలియాలో పనికొస్తుంది. వీరిద్దరు బాగా ఆడి సిరీస్ విజయంలో భాగమవుతారని ఆశిస్తున్నా’ అని గంభీర్ చెప్పాడు.
గిల్‌కు కెప్టెన్సీ అర్హత ఉంది...
భారత టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డేలకు కూడా సారథ్యం వహించే సత్తా, అర్హత శుబ్‌మన్ గిల్‌కు ఉన్నాయని, ఈ హక్కును అతను సాధించుకున్నాడని గంభీర్ ప్రశంసించాడు. ‘కెప్టెన్‌గా గిల్‌ను నియమించి ఎవరూ ఔదార్యం చూపించలేదు. అతడికి ఆ అర్హత ఉంది. కోచ్‌గా కూడా నేను ఈ మాట చెప్పగలను. ప్రపంచ క్రికెట్‌లో అతి కఠినమైన పర్యటనల్లో ఇంగ్లండ్ ఒకటి. అలాంటి చోట ఐదు టెస్టులూ గట్టిగా నిలబడి సిరీస్‌ను సమం చేసుకోగలగడం చిన్న విషయం కాదు.
బ్యాటింగ్‌లోనూ అదరగొట్టడంతో పాటు జట్టును సమర్థంగా నడిపి వన్డేల్లోనూ సారథి కాగల హక్కును అతను సాధించాడు’ అని గంభీర్ అన్నాడు. 2027 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరమని, వరుసగా విజయాలు సాధించడమే తమ లక్ష్యమని అతను స్పష్టం చేశాడు. భారత జట్టు నవంబర్ 9న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడనుండగా... నవంబర్ 14 నుంచి కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతుంది.
అయితే ప్రొఫెషనల్ క్రికెటర్లు తక్కువ సమయంలో పరిస్థితులకు తగినట్లుగా మార్చుకోగలరని విశ్వాసం వ్యక్తం చేసిన గంభీర్... టెస్టు టీమ్‌లో మాత్రమే సభ్యులైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాలని సూచించాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ గెలవడం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే భారత్‌లో కూడా పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే విధంగా బౌన్సీ పిచ్‌లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
హర్షిత్ రాణాపై అనవసర విమర్శలు...
భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్‌లలోనూ వరుసగా అవకాశాలు పొందుతున్న పేస్ బౌలర్ హర్షిత్ రాణాపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభావంతుడు కాకపోయినా... ఢిల్లీకి చెందినవాడు కావడంతో పాటు గంభీర్ ఐపీఎల్ టీమ్ కేకేఆర్‌కు మెంటార్‌గా ఉన్న సమయంలో సాన్నిహిత్యం వల్లే రాణాకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇటీవల ఇదే మాట అన్నాడు. తాజా విమర్శలపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు.
ఈ వివాదంలో హర్షిత్‌కు అతను పూర్తి మద్దతు పలికాడు. ‘యూట్యూబ్‌లో వ్యూస్ కోసం కొందరు ఒక 23 ఏళ్ల యువ ఆటగాడిని లక్ష్యంగా చేసుకున్నందుకు సిగ్గుపడాలి. రాణా తండ్రి మాజీ క్రికెటర్ కాదు. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కానీ ఎన్‌ఆర్‌ఐ కానీ కాదు. అతను తన ప్రతిభను నమ్ముకొనే క్రికెట్ ఆడుతున్నాడు. ఒక ఆటగాడి ప్రదర్శన బాగా లేకుండా విమర్శించవచ్చు కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారా.
కావాలంటే నన్ను విమర్శించండి. నేను దానిని భరించగలను. కానీ 23 ఏళ్ల ఆటగాడిపై ఇది మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా. భారత క్రికెట్ జట్టు ఎవరిదో సొంత ఆస్తి కాదు. మన జట్టు గెలవాలని భావించే అందరిది ఈ జట్టు అని మర్చిపోవద్దు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.