
నేటి నుంచి రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభం
యువ ఆటగాళ్లపైనే అందరి దృష్టి
రెండో అవకాశం కోసం సీనియర్ల యత్నం
బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 91వ సీజన్‌కు నేడు తెరలేవనుంది. ఎలైట్ గ్రూప్‌లో 32 జట్లు, ప్లేట్ గ్రూప్‌లో 6 టీమ్‌లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. మొత్తం 138 మ్యాచ్‌లు జరగనుండగా... రెండు దశల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఒకప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు రంజీ ట్రోఫీలో రాణించడం తప్పనిసరి కాగా... ఇప్పుడు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు వీలు ఉంటే దేశవాళీల్లో ఆడాలని బీసీసీఐ సూచించింది.
ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మినహా... టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడేది లేదు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ ప్రదర్శనతో ఇప్పటికిప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే అయినా... సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇది చక్కటి వేదిక కానుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించనున్నారు. నేటి నుంచి నవంబర్ 19 వరకు తొలి దశ మ్యాచ్‌లు జరగనుండగా... ఆ తర్వాత నవంబర్ 26 నుంచి డిసెంబర్ 18 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్ జరగనుంది.
అనంతరం డిసెంబర్ 26 నుంచి జనవరి 18 వరకు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఫైనల్‌తో సీజన్ ముగియనుంది. మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. ఎనిమిదేసి జట్లు ఉన్న ఒక్కో గ్రూప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. పలువురు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు... యువ ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి మైదానంలో అడుగు పెట్టనుండగా... 42 సార్లు చాంపియన్ ముంబై జట్టు మరో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. కరుణ్ నాయర్ తిరిగి కర్ణాటక జట్టులో చేరగా... తొమ్మిదేళ్ల తర్వాత జలజ్ సక్సేనా కేరళ నుంచి మహారాష్ట్రకు మారాడు. పృథ్వీ షా మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించనుండగా... ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి త్రిపుర తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇలాంటి మరికొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిద్దాం...
» ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్ టెస్టులో క్రిస్ వోక్స్ వేసిన బంతికి గాయపడిన పంత్ అప్పటి నుంచి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. రంజీ ట్రోఫీ తొలి పోరులో ఢిల్లీ జట్టు హైదరాబాద్‌తో తలపడనుండగా... ఢిల్లీ సెలెక్టర్లు 24 మందితో ప్రకటించిన జట్టులో పంత్‌ను ఎంపిక చేయలేదు. దీన్ని బట్టి అతడు ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది.
ఈ నెల అఖరులో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్ వరకు పంత్ జట్టులో చేరొచ్చు. వచ్చే నెల 14 నుంచి ప్రపంచ చాంపియన్ దక్షిణాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది. దానికి ముందు పంత్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని సెలెక్టర్లు ఆశిస్తున్నారు.
» డిఫెండింగ్ చాంపియన్ విదర్భ జట్టు తొలి పోరులో నాగాలాండ్‌తో తలపడనుంది. దేశవాళీల్లో స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న విదర్భ రంజీ ట్రోఫీతో పాటు... ఇటీవల ఇరానీ కప్‌ను సైతం కైవసం చేసుకొని జోరు మీదుంది. గత సీజన్ రన్నరప్ కేరళ, సౌరాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై జట్లు కూడా టైటిల్‌పై కన్నేశాయి.
» గత సీజన్‌లో ముంబై జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించగా... ఇప్పుడు ఆ బాధ్యతలు శార్దుల్ ఠాకూర్ తీసుకున్నాడు. భారత టెస్టు జట్టులో పునరాగమనంపై ఇంకా ఆశలు పెట్టుకున్న రహానే... ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. సహచరుడు పుజారా కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కామెంటేటర్ అవతారమెత్తగా... రహానే మాత్రం ఇంకా పోరాడేందుకు సిద్ధమయ్యాడు.
» గత సీజన్‌లో రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపక బీసీసీఐ ఆగ్రహానికి గురైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్... ఈ సీజన్‌లో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మధ్యప్రదేశ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న రజత్ పాటీదార్ దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్‌లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరి వీరిద్దరూ రంజీ సీజన్‌లో తమ జట్లను ఎలా నడిపిస్తారో చూడాలి.
» సుదీర్ఘ కాలంగా భారత రిజర్వ్ ఓపెనర్‌గా జట్టుతో పాటు ఉన్న బెంగాల్‌కు చెందిన అభిమన్యు ఈశ్వరన్ కూడా తన బ్యాట్ పవర్ చూపేందుకు రెడీ అవుతున్నాడు.
» రవిచంద్రన్ అశి్వన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... తదుపరి తరం స్పిన్నర్ ఎవరనేది రంజీ ట్రోఫీ ద్వారా తేలనుంది. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 69 వికెట్లు పడగొట్టిన విదర్భ స్పిన్ ఆల్‌రౌండర్ హర్‡్ష దూబేపై అందరి దృష్టి నిలవనుంది. రాజస్తాన్‌కు చెందిన మానవ్ సుతార్, ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి.
» సీజన్ ఆరంభానికి ముందు పలువురు యువ ఆటగాళ్లు ఆకర్షిస్తున్నారు. స్మరణ్ (కర్ణాటక), ఆండ్రె సిద్ధార్థ్ (తమిళనాడు), యశ్ ధుల్ (ఢిల్లీ), ప్రియాన్ష్ఆర్య (ఢిల్లీ), వైభవ్ సూర్యవంశీ (బిహార్), ఆయుశ్ మాత్రే (ముంబై), దానిశ్ మాలేవర్ (విదర్భ) వంటి వాళ్లు ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకోగా... దాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.
» గత రంజీ సీజన్‌లో తన వేగంతో ఆకట్టుకున్న కేరళ పేసర్ ఎడెన్ టామ్‌తో పాటు, గుర్‌నూర్ బ్రార్, గుర్‌జపనీత్ సింగ్‌పై సెలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
» దేశవాళీల్లో రాణించడం ద్వారానే ఎనిమిదేళ్ల తర్వత తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ స్ఫూర్తిగా... పలువురు ఆటగాళ్లు రెండో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ముంబైకర్ సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటీదార్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా ఇందులో ఉన్నారు. ఈ సీజన్‌లో పరుగుల వరద పారించి తిరిగి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు.
» 38 ఏళ్ల జలజ్ సక్సేనా ఈ సీజన్‌లో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత తొమ్మిది సీజన్‌లుగా కేరళ తరఫున ఆడిన జలజ్ రాకతో... మహారాష్ట్ర బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమైంది. టీమిండియా ప్లేయర్ జితేశ్ శర్మ విదర్భ నుంచి బరోడాకు మారాడు.
» రెండేళ్లుగా టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన షమీ... పునరాగమనంపై ఆశలు పెట్టుకున్నాడు.
ఢిల్లీ x హైదరాబాద్
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించిన ఠాకూర్ తిలక్ వర్మ... హైదరాబాద్ రంజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం మొదలుకానున్న మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడనుంది.
హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ పోరులో తిలక్‌తో పాటు తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమతేజ, మిలింద్, రాహుల్ సింగ్, రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్ రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. మరోవైపు ఢిల్లీ జట్టు యువ ఆటగాళ్లతో నిండి ఉంది. ఆయశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టులో యశ్ ధుల్, ప్రియాన్ష్ఆర్య, అనూజ్ రావత్, నితీశ్ రాణా, నవ్‌దీప్ సైనీ కీలకం కానున్నారు.
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: ఆంధ్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, నాగాలాండ్, ఒడిశా, విదర్భ, జార్ఖండ్, బరోడా.
గ్రూప్‘బి’: కర్ణాటక, సౌరాష్ట్ర, చండీగఢ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్.
గ్రూప్ ‘సి’: గుజరాత్, అస్సాం, ఉత్తరాఖండ్, సర్వీసెస్, త్రిపుర, రైల్వేస్, బెంగాల్, హరియాణా.
గ్రూప్ ‘డి’: హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్.
ఉత్తరప్రదేశ్ x ఆంధ్ర
గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది. కాన్‌పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. కెప్టెన్ రికీ భుయ్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, షేక్ రషీద్, అశ్విన్ హెబ్బర్, సత్యనారాయణ రాజు, చీపురుపల్లి స్టీఫెన్, విజయ్, శశికాంత్ ఆంధ్ర జట్టుకు కీలకం కాగా... ఉత్తరప్రదేశ్ జట్టు కరణ్ శర్మ, ఆర్యన్ జుయల్, ప్రియమ్ గార్గ్, విప్‌రాజ్ నిగమ్, శివమ్ మావి, రింకూ సింగ్‌పై ఆశలు పెట్టుకుంది.