
ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే 15,000 పేజీల ఆ అఫిడవిట్ ఆసక్తికర అంశాలనే పొందుపరిచింది. ప్రాచీన భారతంలో లేని కుల వివక్ష.. విదేశీ ఆక్రమణల కాలం నుంచే మొదలైందని, అది ఇప్పటికీ సమాజంలో కొనసాగుతోందంటూ ఉదాహరణలతో సహా అందులో ప్రస్తావించింది.
మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 21, 2021లో.. ఓబీసీ రిజర్వేషన్లను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 73 శాతానికి చేరాయి. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధంగా 50% రిజర్వేషన్ పరిమితిని ఉల్లఘించేలా ఉందని(ఇంద్రా సాహ్నీ కేసు), ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నమేనని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో రాజ్యాంగ పరిమితులు, సామాజిక న్యాయం మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. ఈ లోపు..
నిశ్చయ సోనిర్బే అనే ఓబీసీ నేతతో పాటు ఎనిమిది మంది ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
తాజాగా.. ఆ అఫిడవిట్‌లో రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం సమర్థించుకుంది. ప్రాచీన భారతదేశం కులాల లేని, ప్రతిభ ఆధారిత సమాజంగా ఉండేదని అందులో ప్రముఖంగా పేర్కొంది. వేద కాలాన్ని సమానత్వ యుగంగా అభివర్ణిస్తూ.. విదేశీ ఆక్రమణల వల్ల కుల వివక్ష వచ్చిందని తెలిపింది. అదే సమయంలో, రైతులు, కళాకారులపై కుల ఆధారిత దోపిడీ వల్ల దేశ ఆర్థిక పతనం జరిగిందని పేర్కొంది. వర్గ వివక్ష ఇంకా కొనసాగుతోందని వాదించింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో 56% ఓబీసీ ఉద్యోగులు.. ఉన్నత కులాల వారు పక్కన నుంచి పోతుంటే ఇప్పటికీ లేచి నిలబడతారు అని ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ క్రమంలో.. దామోహ్‌లో జరిగిన ఓ ఘటనను ప్రముఖంగా ప్రస్తావించింది. ఓబీసీ కుష్వాహా వర్గానికి చెందిన ఓ యువకుడు, ఓ బ్రాహ్మణుడి ఏఐ ఇమేజ్ క్రియేట్ చేశాడని పాదాలు కడిగించి.. బలవంతంగా ఆ నీటిని తాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కేసు నమోదైంది కూడా. ఇలాంటి ఘటనలతో..
కుల వివక్ష సమాజంలో పేరుకుపోయిందనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. జాతి నిర్మాణంలో భాగంగానే.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే నినాదంతో.. ఓబీసీ రిజర్వేషన్లను పెంచామని అఫిడవిట్‌లో పేర్కొంది. ఇదే కాదు..
సుదీర్ఘమైన అఫిడవిట్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ 2023లో గోప్యంగా నిర్వహించిన ఓ సర్వే వివరాలను పొందుపరిచింది. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 10 వేల గ్రామీణ కుటుంబాలను ఈ సర్వేలో భాగం చేశారు. ఇందులో 5,578 మంది అంటే 56 శాతం.. అగ్రవర్ణాల వాళ్లు తమ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నారని, ఆఖరికి వాళ్లు వెళ్తుంటే మంచంలో కూడా కూర్చోనివ్వరని.. లేచి నిలబడి గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. 3,397 కుటుంబాలు అంటరానితనం, అస్పృశ్యత కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 3,763 కుటుంబాలు.. కలిసి భోజనం చేసేందుకు ఇతర కులాల వాళ్లు అంగీకరించరని తెలిపారు. చివరకు.. కులం కారణంగానే తమ ఇళ్లలో పూజలు నిర్వహించేందుకు పూజారులు ముందుకు రావడం లేదని 3,238 మంది తెలిపారు.
ఓబీసీకి చెందిన సగం మహిళలు.. వ్యవసాయ కూలీలుగానో, కూలీ పనులు చేసుకుంటున్నో గడుపుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో OBCల జనాభా అత్యధికంగా ఉందని.. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారని వాదించింది.
అయితే ఈ అఫిడవిట్‌లో సాంకేతిక అంశాలు ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును సమయం కోరారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రోజువారీ విచారణకు అనుకూలమైన కేసు అని, వాయిదాలు వల్ల ప్రజలకు న్యాయం ఆలస్యం అవుతుందని తెలిపింది. అత్యంత ప్రాధాన్యత గల కేసుగా అభివర్ణిస్తూనే.. చివరకు నవంబర్ 9వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించగా.. దానిని ఎత్తివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇటు మధ్యప్రదేశ్ రిజర్వేషన్ కోటా పిటిషన్ విచారణ కొనసాగుతుండడం గమనార్హం.