
న్యూఢిల్లీ: కోర్టుల్లో కేసుల విచారణల సమయంలో న్యాయమూర్తులు సరదాగా చేసే వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(CJI BR Gavai) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో తనపై దాడి జరిగిన మరుసటిరోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది(Lord Vishnu Shoe Attack Row).
సర్వీస్ కండిషన్స్, వేతనాలు, వృత్తిగతమైన పురోగతిపై ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కలిసి జస్టిస్ గవాయ్ మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా జస్టిస్ కే వినోద్‌తో తన గత అనుభవాన్ని జస్టిస్ గవాయ్ వివరించారు.
‘ఇటీవల ధీరజ్ మోర్ కేసు విచారణ సందర్భంగా నా సహోదరుడు (జస్టిస్ కే వినోద్‌ని ఉద్దేశించి..) ఏదో వ్యాఖ్యానించబోయారు. ఆయనను నేను ఆపాను. లేదంటే తెల్లారి సోషల్ మీడియాలో ఏమేం ప్రచారం చేసేవారో తెలియదు. అందుకే ఆయనను నాకు మాత్రమే వినపడేలా చెప్పమన్నాను’అని జస్టిస్ గవాయ్ తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
కొద్దిరోజుల క్రితం ఖజురహో ఆలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే.
‘‘మీరు విష్ణువు భక్తులని అంటున్నారు. కాబట్టి, మీరు వెళ్లి ప్రార్థన చేయండి. కోర్టులకు కాకుండా దైవాన్నే అడిగి చూడండి’’ అంటూ పిటిషనర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఖజురహో ఆలయ సముదాయం యూనెస్కో (UNESCO) వారసత్వ స్థలంగా గుర్తించబడింది. కాబట్టి విగ్రహ పునఃస్థాపనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనుమతి అవసరమని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో జస్టిస్ గవాయ్ ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. తనకు అన్ని మతాలు సమానమే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేశం సహించబోదు అంటూ కోర్టులోనే జస్టిస్ గవాయ్‌పై ఓ న్యాయవాది బూటు విసిరేయటం సంచలనం సృష్టించింది(Attack on BR Gavai).
ఇదీ చదవండి: బూటు విసిరింది ఆ దేవుడే!