
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై షూతో దాడికి ప్రయత్నించిన(Shoe Attack On CJI BR Gavai) అడ్వొకేట్(సస్పెండెడ్) రాజేష్ కిషోర్(71).. నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఇప్పుడు వరుస బెట్టి మీడియా చానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటున్న ఆయన.. ఆ పని తాను చేయలేదంటూ వింత వాదన చేస్తున్నారు.
‘‘ఆ పని నేను చేయలేదు, దేవుడే చేశాడు. భారత ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారు. ఇది భగవంతుని ఆజ్ఞ, చర్యకు ప్రతిచర్య మాత్రమే’’ అని అంటున్నారు. అదే సమయంలో తనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేయడాన్ని రాజేష్ కిషోర్(Rajesh Kishore) తీవ్రంగా తప్పుబడుతున్నారు. తన వాదన వినకుండానే చర్యలు తీసుకున్నారని, ఇది హద్దులు దాటడడమేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై మండిపడుతున్నారు.
సీజేఐ గవాయ్‌పై షూ విసిరిన ఘటన సోమవారం(అక్టోబర్ 6వ తేదీన) సుప్రీం కోర్టులో కలకలం రేపింది. ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాజేష్‌కిషోర్ తన షూ తీసి సీజేఐ మీదకు విసిరారు. అయితే షూ ఆయన ముందున్న టేబుల్ మీద పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే తోటి లాయర్లు రాజేష్‌ను పట్టుకుని.. సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మూడు గంటలపాటు రాజేష్‌ను విచారించి వదిలేశారు. అయితే..
చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచన మేరకు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కేసు నమోదుకు ముందుకు రాలేదు. అయితే.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రం రాజేష్‌పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. జరిగిన దానికి 15రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: సీజేఐపై దాడి ఘటన: ప్రధాని మోదీ ఏమన్నారంటే..