న్యూఢిల్లీ: వీధి శునకాలకు సంబంధించిన విచారణలో సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ సమస్య కుక్క కాటుకు మాత్రమే పరిమితం కాదని ధర్మాసనం పేర్కొంది. సైకిళ్ళు , మోటార్ సైకిళ్లపై ప్రజలను వెంబడించే కుక్కలు సమానంగా ప్రమాదకరమని , తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీయవచ్చని పేర్కొంది.
వీధి కుక్కలను తొలగించడంపై అభ్యంతరంపై బెంచ్ స్పష్టత కోరింది. ఈ అంశాన్ని మరింత నొక్కి చెబుతూ, సంస్థాగత ప్రాంతాల నుండి వీధి కుక్కలను తొలగించడంలో ఉన్న వ్యతిరేకతను వివరించాలని బెంచ్ న్యాయవాదిని కోరింది. కుక్క కరిచే మూడ్‌లో ఉన్నప్పుడు దాని మనసులో ఏముందో మనం చదవలేం కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకేనివారణే ఉత్తమమైన మార్గమని, అయితే కుక్కలను కాల్చి చంపాలని సూచించడం లేదని, వాటిని ఆశ్రయాలకు మార్చాలని బెంచ్ నొక్కి చెప్పింది. మున్సిపల్ సంస్థలు జంతు జనన నియంత్రణ నియమాలను కఠినంగా అమలు చేయడం వల్ల పర్యవేక్షణతో క్రమంగా సంఖ్యలు తగ్గుతాయని కూడా పేర్కొంది. లక్షలాది కుక్కలకు ఆహారం ఇవ్వడం యొక్క సాధ్యాసాధ్యాలను బెంచ్ ప్రశ్నించింది.
అలాగే ABC (యానిమల్ బర్త్ కంట్రోల్) నియమాలు , చట్టాలను పాటించేలా చూడటం కోర్టు పాత్ర అనిజస్టిస్ విక్రమ్ నాథ్ స్పష్టం చేశారు. పాటించని రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
దీనిపై తన వాదనను వినిపిస్తూ కుక్కలను తొలగించడం వల్ల పట్టణ సమస్యలు మరింత తీవ్రమవుతాయని, భారతదేశం వంటి దేశంలో చెత్త డంపింగ్, మురికివాడలు విస్తృతంగా ఉన్న చోట, వీధి కుక్కలను తొలగించడం వల్ల ఇప్పటికే ఉన్న సమస్యలు మరింత తీవ్రమవుతాయని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హెచ్చరించారు. పట్టణ పర్యావరణ వ్యవస్థలలో కుక్కలు పాత్ర పోషిస్తాయని మరియు ఆకస్మిక తొలగింపు ఊహించని పరిణామాలను సృష్టించవచ్చని ఆయన వాదించారు ABC, CSVR (వంధ్యీకరణ–టీకాలు వేయడం,విడిచిపెట్టడం) లాంటి చర్యల ద్వారా వీటి సంఖ్యన పరిమితం చేయవచ్చని కూడా సిబల్ ప్రతిపాదించారు. దీన్ని విజయవంతంగా పరీక్షించారనీ, కుక్కల్ని నిర్మూలించడం కాకుండా, వాటి జనాభాను నియంత్రించాలన్నారు. అలాగే వీధి కుక్కలను షెల్టర్లలోకి మార్చడం శారీరకంగా అసాధ్యం, ఆర్థికంగా అసాధ్యమైనదని సిబల్ సుప్రీంకు తెలిపారు. ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి శాస్త్రవేత్తలు మరియు డొమైన్ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సిబల్ సుప్రీంకోర్టును కోరారు. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.
కాగా తమ వద్ద విచారణలో ఉన్న కేసుకు అనుబంధంగా కుప్పలుతెప్పలుగా అనుబంధ పిటిషన్లు, దరఖాస్తులు వచ్చిపడుతున్నాయని సుప్రీం వెల్లడించింది. సాధారణంగా చూస్తే మనుషులకు సంబంధించిన ఏ కేసులో కూడా ఇన్ని అప్లికేషన్లు రాలేదేమో. కుక్కల విషయంలో పిటిషన్లు పోటెత్తు తున్నాయి. ఇలాంటి అప్లికేషన్లు బుధవారం కూడా వస్తాయేమో. అన్నీ కలిపి బుధవారమే కేసును విచారిస్తాం’’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది. వీధి శునకాలకు సంబంధించిన కేసును జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల ధర్మాసనం విచారిస్తోంది.


