
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బిల్ఖేరియాలో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డు సడన్‌గా 30 అడుగుల మేర కుంగిపోయింది. మండిదీప్ నుండి ఇంత్ఖేడి వెళ్లే రోడ్డులోని వంతెన సమీపంలో ఈ ఘటన జరగ్గా.. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ వంతెనను దశాబ్దం క్రితం నిర్మించారు.
ఈ రహదారి.. మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MPRDC) పరిధిలోకి వస్తుంది. ఇండోర్, హోషంగాబాద్, జబల్‌పూర్, జైపూర్, మాండ్లా, సాగర్ వంటి ముఖ్యమైన మార్గాలను కలుపుతుంది. ఈ ఘటనతో రహదారుల నాణ్యతపై చర్చ నడుస్తోంది.
రహదారి కూలిపోవడానికి గల కారణాన్ని పరిశోధించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక పరిశీలనలో రీఎన్‌ఫోర్స్డ్ ఎర్త్ (RE) గోడ కూలిపోవడం వల్ల జరిగిందని తెలుస్తోంది. దర్యాప్తు నివేదిక విడుదలైన తర్వాత ప్రమాదానికి గల కారణం స్పష్టమవుతుందని MPRDC డివిజనల్ మేనేజర్ సోనాల్ సిన్హా మీడియాకు తెలిపారు.
#WATCH | Bhopal, Madhya Pradesh | A major section of the road near Bilkhiriya village collapsed. The road has been barricaded, and traffic has been diverted. (13.10) pic.twitter.com/mVI74tn8If
— ANI (@ANI) October 13, 2025
ఈ వంతెన 2013లో నిర్మించారు. అయితే, నిర్మాణ సంస్థ M/s ట్రాన్స్‌స్ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్‌ను 2020లో రద్దు చేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు మార్గాన్ని అధికారికంగా ఏ సంస్థ కూడా పర్యవేక్షించలేదు. గతంలో, గ్వాలియర్‌లో 18 కోట్ల రూపాలయతో నిర్మించిన రోడ్డు ప్రారంభించిన 15 రోజులకే కుంగిపోయిన సంగతి తెలిసిందే.