పాలల్లో నీరు కలపడమే పాపం అయిపోయింది
పదేళ్ల కలల పంట కాలుష్య భూతానికి బలి
పదేళ్ల కలల పంట..ముద్దులొలికే కొడుకుని చూసుకొని దేవుడిచ్చిన వరం అనుకొని మురిసిపోయారు. కానీ వారికి ఆ ఆనందం ఎంతోకాలం నిలువ లేదు. మధ్యప్రదేశ్‌లో మృత్యుఘంటికలు మోగిస్తున్న నీటి కాలుష్యభూతం వారి ఐదు నెలల చిన్నారిని బలితీసుకుంది. దీంతో తీరని విషాదం. గుండె పగిలేంత బాధ. కన్నీళ్ల సునామీ తప్ప నోరు పెగలని నిశ్శబ్దం. దేశంలోని పలునగరాల్లో ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న గాలి, నీరు, వాయు కాలుష్య భూతానికి ఇండోర్ (Indore) మరో మచ్చుతునక.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని భగీరత్‌పురలో చోటు చేసుకున్న విషాదమిది. పాలల్లో కలిసిని కలుషిత మైన నీరు ఐదు నెలల చిన్నారి అవ్యాన్ సాహు ఉసురు తీసింది. బాధితుడి తండ్రి సునీల్ సాహు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరికి పదేళ్లక్రితం కింజల్ అనే పాపుట్టింది. చాలా ఏళ్ల ఎదురు చూపుల తరువాత గత ఏడాది జూలై 8న అవ్యాన్ జన్మించాడు. చక్కటి ఆరోగ్యంగా ముద్దుల మూటగడుతున్న చిన్నారిని చూసి అమ్మమ్మ ఎంతో మురిసిపోయింది. అయితే అవ్యాన్ పుట్టిన తరువాత కొన్ని జెనెటిక్ కారణాల రీత్యా తల్లికి పాలుపడలేదు. వైద్యుల సలహామేరకు పోతపాలు పట్టిస్తున్నారు. రోజూలాగానే బిడ్డకు పాలు కలిపి తాగించారు. కుళాయి నీరు వడకట్టి, పటికను జోడించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కాలుష్యం అవ్యాన్‌ను కాటేసింది.
జ్వరం, విరేచనాల ( Diarrhoea) తో బాధపడుతున్న పిల్లాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు. పరిస్థితి మరింత దిగజారి సోమవారం ఉదయం,ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలోనే అవ్యాన్ కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారి తీరిని విషాదం అలుముకుంది. బిడ్డను కోల్పోయిన తల్లి కంటికి మింటికి ధారగా విలపిస్తోంది. తీరని దుఃఖంతో స్పృహ కోల్పోతూ, మెలకువ రాగానే మళ్లీ శోకంతో కుంగిపోతోంది. నీరు కలుషితమైంది తమకెవరూ చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత తండ్రి సునీల్‌ది. తాము నమ్మిన నీరే బిడ్డ ప్రాణం తీసిందని వాపోతున్నాడు.
మేం పేదోళ్లం సార్.. మేం ఎవర్నీ నిందించలేం.ఇది మా తలరాత అంటూ రోదిస్తోంది అమ్మమ్మ. తమ కుటుంబనాకి పెద్ద నష్టమే కానీ ఏం జరిగిందో అర్థం కాక పదేళ్ల కింజల్ నిశ్శబ్దంగా దీనంగా చూస్తోంది.

కాగా దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఏడేళ్లు గుర్తింపు పొందిన ఇండోర్‌లోని భాగీరథ్‌పురాలో, నర్మదా నది పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలిసి, తాగునీరు కలుషితమైంది. దీంతో చాలామంది చనిపోయారు. గత పది రోజులుగా పలువురు బాధితులు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతన్నారు. మరోవైపు ఈవిషయంపై దర్యాప్తు నిమిత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.


