ఈ సీజన్‌లో హిమపాతం అత్యంత స్వల్పం
ఆ ప్రాంతంలో తాగు, సాగునీటికి కటకటలే
ఈ సీజన్‌లో పర్యాటకానికి ఇప్పటికే దెబ్బ
పర్యావరణ మార్పుల తాలూకు దు్రష్పభావం
పెను ప్రమాద సంకేతాలేనని పర్యావరణవేత్తల హెచ్చరిక
కశ్మీర్. ఈ మాట వినగానే మొదట గుర్తొచ్చేవి మంచు దుప్పటి కప్పుకున్న అందాల హిమ శిఖరాలే. కానీ కొన్నేళ్లుగా ఈ దృశ్యం చెదిరిపోతోంది. కశ్మీర్‌కు మంచు ముఖం చాటేస్తోంది. ఈ ఏడాదైతే చలికాలం రెండొంతులకు పైగా గడిచిపోయినా ఈ భూతల స్వర్గంలో హిమపాతం అత్యంత తక్కువగానే నమోదైంది. ఈ పరిణామం పర్యావరణవేత్తలను ఎంతగానో ఆందోళన పరుస్తోంది. వాతావరణ మార్పుల తాలూకు తీవ్ర విపరిణామాలకు ఇది మరో సూచిక పర్యావరణవేత్త అంటున్నారు. తక్షణం మేలుకోకుంటే పెను ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక సంక్షోభమే..
కశ్మీర్ లోయలో ఈ సీజన్‌లో హిమపాతం సాధారణం కంటే కూడా అతి తక్కువగా నమోదైంది. ఏటా ఈసారికల్లా మంచు దుప్పటి కప్పుకుని శ్వేతవర్ణం సంతరించుకునే చాలా ప్రాంతాలు ఈ ఏడాది మాత్రం మంచు జాడే లేక వెలవెలబోతున్నాయి. దాంతో అందాల కశ్మీరం చాలావరకు బోసిపోయి కన్పిస్తోంది. ఇది పర్యావరణపరంగా పెను ప్రమాద సంకేతం మాత్రమే కాదు, ఆర్థికంగా, సాగుపరంగా, పర్యాటకపరంగా ఈ ప్రాంతాన్ని తీవ్రంగా కుంగదీస్తోంది.
మైదానాలు, మరీ అంత ఎత్తులో లేని ప్రాంతాల్లో మంచు లేకపోవడంతో అక్కడి రైతులు, వ్యాపారులు, గైడ్‌లు తదితరులు లబోదిబోమంటున్నారు. ‘‘పశ్చిమ హిమాలయాల్లో క్రమంగా నెలకొంటున్న తీవ్ర పర్యావరణ అసమతుల్యతకు ఈ పరిణామం అద్దం పడుతోంది. మున్ముందు కశ్మీర్ ప్రాంతం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పదని చెప్పకనే చెబుతోంది’’అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన ప్రొఫెసర్ అంజల్ ప్రకాశ్ విశ్లేషించారు. కశ్మీర్, జమ్మూ ఆర్థిక స్థితిగతులపై కొంతకాలంగా ఆయన లోతైన అధ్యయనం చేస్తున్నారు.
అన్నింటికీ మంచే కీలకం..
కశ్మీర్ లోయలో కురిసే మంచు కేవలం అందాలకు ప్రతీక మాత్రమే కాదు. దానికి ఇతరత్రా కీలక ప్రయోజనాలెన్నో ఉన్నా యి. ఈ భారీ మంచు దుప్పట్లు శీతాకాలం అనంతరం సహజ నీటి వనరుగా రూపొందుతాయి. చలికాలంలో గడ్డకట్టి ఉండి, అనంతరం వేసవి వస్తున్న కొద్దీ దిగువ ప్రాంతాలకు క్రమం తప్పకుండా నీటిని విడుదల చేస్తూ కీలక జల వనరులుగా మారతాయి. జీలం వంటి కీలక నదులకు కూడా ఈ నీరు ప్రాణదాయినిగా మారుతుంది. పలు పట్టణాలు, గ్రామాలకు నీరందించే సెలయేళ్లకు ఈ జలమే ఆధారం.
కశ్మీర్ లోయలోని వ్యవసాయమంతా ఇలా వేసవిలో కరిగే నీటిపైనే ఆధారపడి నడుస్తుంటుంది. ‘‘ఇప్పుడిలా మంచు ఈ స్థాయిలో తగ్గిపోవడమంటే సాగు నుంచి తాగునీటి దాకా ఇక్కట్లు తప్పవని అర్థం. నాణ్యతకు దేశమంతటా పెట్టింది పేరైన కశ్మీర్ యాపిల్స్ వంటి వాటి దిగుబడి భారీగా తగ్గిపోవడం ఖాయం. రైతులు విధిలేక భూగర్భ జలాలపై ఆధారపడాల్సి వస్తుంది. కొన్నేళ్లకు దాని లభ్యతా అనుమానంగానే మారుతుంది’’అని ప్రకాశ్ హెచ్చరించారు.
వేగంగా వేడెక్కుతున్నాయ్!
ఉత్తర భారతదేశంలో పర్వత ప్రాంతాలు, ముఖ్యంగా హిమాలయాలు ఇతర మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా వేడెక్కుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ‘‘ఇది ప్రపంచ సగటు కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. పైగా ప్రమాదకర ఈ ధోర ణి ఏటా వేగం పుంజుకుంటోంది’’అని వారు ఆందళన వ్యక్తం చేస్తున్నారు. దేశాలన్నీ మే ల్కొని ఈ వినాశకర పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేసే చర్యలకు తక్షణం పూనుకోని పక్షంలో మిగిలేది వినాశనమేనని వారు హెచ్చరిస్తున్నారు!
ఉష్ణోగ్రతలు సున్నాకు పడిపోయినా...
శీతాకాలం వచ్చిందంటే కశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీ సెల్సియస్ కంటే కూడా దిగువకు పడిపోవడం పరిపాటి. ఈసారి కూడా అదే జరిగింది. కానీ జరగనిదల్లా హిమపాతం మాత్రమే. గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, పీర్‌పంజల్ శ్రేణి వంటి అత్యున్నత కొండ ప్రాంతాలకే ఈసారి హిమపాతం పరిమితమైంది. మిగతా కశ్మీరమంతా మంచు జాడ లేక వెలవెలబోతున్నాయి. మంచు ఇలా ఈ ప్రాంతానికి ముఖం చాటేయడానికి గ్లోబల్ వారి్మంగ్ ప్రధాన కారణమని పర్యావరణవేత్త అనిల్ జోషి స్పష్టం చేస్తున్నారు.
పడకేసిన పర్యాటకం..
శీతాకాలపు మంచు, అనంతరం వేసవిలో సకాలంలో అది కరగడం.. ఈ రెండూ కశ్మీర్‌కు జీవనాడులు అని చెప్పాలి. సాగు మొదలుకుని పర్యాటకం దాకా అన్నీ వీటిపైనే ఆధారపడి సాగుతాయి. ఈసారి మంచు లేకపోవడం పర్యాటకంపై గట్టి ప్రభావమే చూపింది. ఏటా శీతాకాలం ఇక్కడ అతి పెద్ద పర్యాటక సీజన్. అలాంటిది ఈసారి కశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదవుతోంది. ఏటా స్కీయింగ్ వంటివి జరిగే చోట్ల ఈసారి మంచు కంటికి కనిపించని పరిస్థితి నెలకొనడమే ఇందుకు కారణం. దాంతో తమ జీవనోపాధి దారుణంగా దెబ్బతింటోందని గైడ్‌ల సమాఖ్య మొదలుకుని హోటల్ వర్గాల దాకా వాపోతున్న పరిస్థితి!
– సాక్షి, నేషనల్ డెస్క్


