
రెండో టెస్టులో 7 వికెట్లతో భారత్ జయభేరి
వెస్టిండీస్‌పై 2–0తో సిరీస్ క్లీన్‌స్వీప్
కేఎల్ రాహుల్ అర్ధశతకం
న్యూఢిల్లీ: వెస్టిండీస్ మూడో రోజు ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టిన పోరాటం నాలుగో రోజూ కొనసాగడం... ఇద్దరి సెంచరీల మైలురాయితో ఆతిథ్య భారత్ ముందు లక్ష్యాన్ని ఉంచడంతో ఈ చివరి టెస్టు చివరి రోజుదాకా సాగింది. మంగళవారం ఆటలో భారత్ సులువైన లక్ష్య ఛేదనలో మిగిలిపోయిన లాంఛనాన్ని తొలి సెషన్‌లోనే పూర్తి చేసింది. అలా రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి గెలిచింది.
ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (108 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం సాధించాడు. రోస్టన్ చేజ్ 2 వికెట్లు తీయగా... వారికెన్‌కు ఒక వికెట్ దక్కింది. రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ లభించింది. రెండు టెస్టుల్లో ఆడిన ఒకే ఇన్నింగ్స్‌తో శతక్కొట్టిన జడేజా 8 వికెట్లు కూడా తీశాడు. కాగా ఈ రెండో టెస్టులో 8 వికెట్లు (5/82, 3/104) పడగొట్టిన కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
గంటసేపు పైగా...
ఆఖరి రోజు మిగిలిపోయిన 58 పరుగులు చేసేందుకు 63/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కాసేపటికే సాయి సుదర్శన్ (76 బంతుల్లో 39; 5 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రాహుల్‌కు జతయిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (13) కూడా వికెట్‌ను సమర్పించుకోవడంతో లాంఛనం పూర్తి చేసేందుకు భారత్ గంటసేపు పైగానే ఆడాల్సి వచ్చింది.
క్రీజులోకి ధ్రువ్ జురేల్ (6 నాటౌట్; 1 ఫోర్) రాగా... 102 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించాడు. కేఎల్ రాహుల్ తొలి టెస్టులో శతకంతో కదంతొక్కాడు. ఈ క్లీన్‌స్వీప్ విజయంతో టీమిండియా ‘ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్’ పాయింట్ల పట్టికలో 61.9 శాతంతో మూడో స్థానాన్ని పటిష్టం చేసుకుంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 390; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) ఫిలిప్ (బి) వారికెన్ 8; రాహుల్ (నాటౌట్) 58; సాయి సుదర్శన్ (సి) షై హోప్ (బి) చేజ్ 39; గిల్ (సి) గ్రీవెస్ (బి) చేజ్ 13; ధ్రువ్ జురేల్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (35.2 ఓవర్లలో 3 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–9, 2–88, 3–108. బౌలింగ్: సీల్స్ 3–0–14–0, వారికెన్ 15.2–4–39–1, పియర్ 8–0–35–0, చేజ్ 9–2–36–2.
10 వెస్టిండీస్‌పై భారత్ వరుస సిరీస్ విజయాల సంఖ్య. దక్షిణాఫ్రికా పేరిట ఉన్న ఒకే జట్టుపై వరుస సిరీస్ విజయాల రికార్డును భారత్ సమం చేసింది. దక్షిణాఫ్రికా జట్టు కూడా విండీస్‌పై వరుసగా పది సిరీస్‌లలో గెలిచింది.
14 ఢిల్లీ గడ్డపై టీమిండియా అజేయ రికార్డు. భారత్ 1993 నుంచి ఇక్కడ ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా ఓడలేదు. 12 టెస్టులు గెలువగా, రెండు ‘డ్రా’ అయ్యాయి.
122 సొంతగడ్డపై భారత్ గెలిచిన టెస్టులు. సంప్రదాయ క్రికెట్ చరిత్రలోనే ఇది మూడో అత్యధికం. ఆ్రస్టేలియా (262), ఇంగ్లండ్ (241) మాత్రమే ముందున్నాయి.