
మూడు మ్యాచ్ సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో (Bangladesh) ఇవాళ (అక్టోబర్ 14) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.
ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) (111 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్హమైన సెంచరీని రనౌటై, చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) కూడా రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 99 పరుగులు జోడించారు. ఆతర్వాత జద్రాన్ సెదిఖుల్లా అటల్ (29) సాయంతో ఇన్నింగ్స్ను పటిష్ట పరిచాడు. వీరిద్దరు రెండో వికెట్కు 74 పరుగులు జోడించారు.
అయితే సెదిఖుల్లా ఔటయ్యాక ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. 76 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెటరన్ మొహమ్మద్ నబీ (Mohammad Nabi) జూలు విదిల్చాడు. బంగ్లా బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు.
చివరి రెండు ఓవర్లలో 44 పరుగులు పిండుకున్నాడు. నబీ ధాటికి ఆఫ్ఘన్ స్కోర్ రాకెట్లా పైకెళ్లి పోయింది. 249 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ పడ్డ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగియడం లాంఛనమే అనుకున్నారు.
అయితే నబీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో నబీ 37 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
నబీ ఇటీవల షార్జాలో కూడా ఇలాంటి సునామీ ఇన్నింగ్సే ఆడాడు. ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు తొలుత పట్టు కోల్పోయినా, ఆతర్వాత పుంజుకున్నారు. సైఫ్ హసన్ 3, హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం తలో 2, రిషద్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టారు.
కాగా, ఈ సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది.