టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) భారీ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా డెవాల్డ్ బ్రెవిస్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఐసీసీ ఆగ్రహించింది. ఓ డిమెరిట్ పాయింట్ జోడించి, 24 నెలల్లో మొదటి తప్పిదం కావడంతో మందలింపు వదిలేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆర్టికల్ 2.5 ఉల్లంఘన కిందికి వస్తుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రాంచీ వేదికగా నవంబర్ 30న భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్రెవిస్‌ను ఔట్ చేసిన తర్వాత అత్యుత్సాహానికి లోనైన హర్షిత్ ఆగ్రహపూరితమైన సెండ్ ఆఫ్ గెశ్చర్ (డ్రెస్సింగ్‌రూమ్ వైపు చూపిస్తూ వెళ్లు అన్నట్లు సైగ చేశాడు) ఇచ్చాడు.
ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇలాంటి దురుసు ప్రవర్తనకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గత 24 నెలల్లో హర్షిత్ చేసిన మొదటి తప్పిదం ఇదే కావడంతో భారీ మూల్యాన్ని తప్పించుకున్నాడు.
ఓవరాక్షన్‌కు తప్పదు మూల్యం
వాస్తవానికి హర్షిత్‌కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేమీ కాదు. గతంలో ఐపీఎల్, దేశవాలీ టోర్నీల్లోనూ చాలా సందర్భాల్లో ఇలాగే ప్రవర్తించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆయుశ్ దోసేజా, ఐపీఎల్‌లో మయాంక్ అగర్వాల్ పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు క్రికెట్ సమాజం అతనిపై దుమ్మెత్తిపోసింది.
అయినా హర్షిత్ తన తీరు మార్చుకోకుండా డెవాల్డ్ బ్రెవిస్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భవిష్యత్తులోనూ హర్షిత్ ఇలాంటి ప్రవర్తనే కొనసాగిస్తే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అతడి కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
గతంలో చాలామంది క్రికెటర్లు ఇలాగే కెరీర్‌లను నాశనం చేసుకున్నారు. కాబట్టి హర్షిత్ ఇకనైనా ప్రవర్తన మార్చుకుంటే ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న కెరీర్‌ను కాపాడుకోగలుగుతాడు.
తొలి వన్డేలో పర్వాలేదు
ప్రస్తుతం హర్షిత్ సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో హర్షిత్ ఓ మోస్తరు ప్రదర్శనతో (10-1-64-2) పర్వాలేదనిపించాడు. ఇప్పుడిప్పుడే ఈ యువ పేసర్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు.
కాగా, రాంచీ వన్డేలో భారత్ సౌతాఫ్రికాపై 17 పరుగుల తేడాతో గెలుపొంది, మూడు మ్యాచ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ మ్యాచ్‌లో విరాట్ సూపర్ సెంచరీ చేసి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఇవాళ రాయపూర్ వేదికగా రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే టీమిండియా కొనసాగించింది.
దక్షిణాఫ్రికా మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగింది. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమాతో పాటు కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి తుది జట్టులోకి వచ్చారు.


