భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి అర్ధంతరంగా ఆగిపోవడంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. పలాష్ ముచ్చల్ ఆమెను మోసం చేశాడంటూ ఓ వర్గం ట్రోల్ చేస్తుండగా.. ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందని మరికొందరు వాదిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో పలాష్ ముచ్చల్ (Palash Mucchal) తల్లి అమితా ముచ్చల్ ఇటీవల స్పందిస్తూ.. ‘‘స్మృతి- పలాష్ ఇద్దరూ బాధలో ఉన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. వారి వివాహం జరుగుతుంది’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు. దీంతో స్మృతి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందని అభిమానులు సంతోషించారు.
కొత్త తేదీ ఇదేనంటూ...
ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్ పెళ్లి (Smriti Mandhana Wedding Postponed)కి కొత్త తేదీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. డిసెంబరు 7న వీరిద్దరు వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ విషయంపై స్మృతి మంధాన సోదరుడు శ్రావణ్ మంధాన (Shravan Mandhana) తాజాగా స్పందించాడు.
తొలిసారి స్పందించిన మంధాన కుటుంబం
హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో నాకైతే తెలియదు. ఇప్పటికీ ఈ వివాహం ఇంకా వాయిదా పడే ఉంది’’ అని శ్రావణ్ మంధాన రూమర్లను కొట్టిపాడేశాడు. స్మృతి- పలాష్‌ల పెళ్లి గురించి ఇప్పటి వరకు తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు.
2019 నుంచి ప్రేమలో..
కాగా సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 2019 నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది ఈ విషయాన్ని బయటపెట్టిన ఈ జంట.. ఇటీవలే తమ వివాహ తేదీని కూడా వెల్లడించారు. నవంబరు 23న తాము పెళ్లితో ఒక్కటికానున్నట్లు తెలిపారు.
అందుకు తగ్గట్లుగానే హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, పెళ్లికి మరి కొన్ని గంటల సమయం ఉందనగా అనూహ్య రీతిలో తంతు వాయిదా పడింది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరగా.. వరుడు పలాష్ కూడా ఆస్పత్రిపాలయ్యాడు.
తనతో చాట్ చేశాడంటూ ఓ అమ్మాయి..
ఇంతలో పలాష్ తనతో చాట్ చేశాడంటూ ఓ అమ్మాయి.. ప్రైవేట్ విషయాలను బహిర్గతం చేసింది. దీంతో పెళ్లికి ముందు రోజు రాత్రి ఈ విషయం తెలిసి స్మృతి తండ్రి.. పలాష్‌తో గొడవపడి గుండెపోటుకు గురయ్యాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఇటు ముచ్చల్.. అటు మంధాన కుటుంబం స్పందించలేదు. కనీసం ఖండించనూ లేదు.
దీంతో అనుమానాలు మరింత బలపడగా.. పలాష్ తల్లి మాత్రం త్వరలోనే తన కుమారుడి వివాహం జరుగుతుందని చెప్పడం గమనార్హం. అయితే, ఈ విషయంపై ఇంత వరకు గుంభనంగా ఉన్న మంధాన కుటుంబం మాత్రం తొలిసారి మౌనం వీడి.. పెళ్లికి కొత్త తేదీ ఖరారు చేయలేదని కుండబద్దలు కొట్టడం గమనార్హం.


