క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలుత విండీస్ బౌలర్లు రెచ్చిపోయి కివీస్‌ను 231 పరుగులకే కట్టడి చేయగా.. ఆతర్వాత కివీస్ బౌలర్లు విండీస్‌ను 167 పరుగులకే కుప్పకూల్చి ప్రతీకారం తీర్చుకున్నారు. జేకబ్ డఫీ ఐదు వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బేశాడు. మ్యాట్ హెన్రీ 3, ఫౌల్క్స్ 2 వికెట్లతో మిగతా పని కానిచ్చేశారు.
తేజ్‌నరైన్ చంద్రపాల్ (52), షాయ్ హోప్ (56) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరు కాకుండా ఇమ్లాచ్ (14), రోచ్ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు ఖాతా కూడా తెరవలేకపోయారు.
అంతకుముందు విండీస్ బౌలర్లు తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. కేన్ విలియమ్సన్ (52), బ్రేస్‌వెల్ (47) ఓ మోస్తరుగా రాణించడంతో ఆ జట్టు గౌరవప్రమైన స్కోర్ చేయగలిగింది.
64 పరుగుల కీలక ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ 10, డెవాన్ కాన్వే 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.


