వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ఎంపిక
వెల్లింగ్టన్: సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) న్యూజిలాండ్ టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు జాతీయ కాంట్రాక్టుకు దూరమైన విలియమ్సన్... పరిమిత మ్యాచ్‌ల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌లకు దూరమైన కేన్... వచ్చే నెల 2 నుంచి వెస్టిండీస్ (NZ vs WI Tests)తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు. దీని కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
టామ్ లాథమ్ సారథ్యంలో..
ఇప్పటికే వెస్టిండీస్‌పై టీ20, వన్డే సిరీస్‌లు నెగ్గిన న్యూజిలాండ్... సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. టామ్ లాథమ్ జట్టుకు సారథ్యం వహించనుండగా... కాన్వే, విలియమ్సన్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ బ్యాటింగ్ భారం మోయనున్నారు.
ఇక విలియమ్సన్ వంటి అనుభవం గల ఆటగాడు జట్టులో ఉండటం ఇతర ఆటగాళ్లకు ఎంతగానో ఉపకరిస్తుందని న్యూజిలాండ్ హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ అన్నాడు. పేస్ బౌలర్లు జాక్ ఫౌల్క్స్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నెర్ జట్టులో చోటు దక్కించుకోగా... గాయం నుంచి పూర్తిగా కోలుకోని కైల్ జెమీసన్‌ను ఈ సిరీస్‌కు పరిగణించలేదు.
వెస్టిండీస్‌తో టెస్టులకు న్యూజిలాండ్ జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్‌నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.
చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్


