సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవాల్సిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తప్పుడు షాట్ సెలక్షన్‌తో మూల్యం చెల్లించాడు. క్రీజులో కుదురుకుంటాడని అనుకునే లోపే.. వికెట్ పారేసుకుని పెవిలియన్ చేరాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించాడు.
గువాహటి వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శనివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు టీమిండియా ధీటుగా బదులు ఇవ్వలేకపోయింది.
దారుణంగా విఫలం
సఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ అర్ధ శతకం (58)తో రాణించగా.. కేఎల్ రాహుల్ 22 పరుగులు చేయగలిగాడు. సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) ఇలా వచ్చి అలా వెళ్లారు.
పంత్ తొందరపాటు.. రివ్యూ కూడా వేస్ట్
ఇక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 48 పరుగులతో భారత టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. టెయిలెండర్ 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేయగలిగాడు. దీంతో భారత్ కనీసం 200 పరుగుల మార్కు దాటగలిగింది. నిజానికి పంత్ అనవసరపు షాట్‌కు యత్నించి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది.
భారత ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసిన పంత్.. యాన్సెన్ బౌలింగ్‌లో స్లాగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్ కీపర్ కైలీ వెరెన్నె చేతుల్లో పడింది.
అప్పటికీ తన తప్పును గుర్తించని పంత్.. రివ్యూకి వెళ్లి మరీ ప్రతికూల ఫలితం చవిచూశాడు. అనవసరంగా రివ్యూ కూడా వృథా చేశాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పంత్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘ఈరోజుల్లో బ్యాటర్లంతా.. ‘నా సహజశైలిలోనే ఆడతా’ అని చెబుతూ ఉంటారు.
ఇలా ఎవరైనా చేస్తారా?
కానీ దాని కంటే పరిస్థితులను అర్థం చేసుకుని... దానికి తగ్గట్టుగా ఆడటం అత్యంత ముఖ్యం. ప్రత్యర్థి జట్టు కోణంలో.. పంత్ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. అంత ఎక్కువగా మ్యాచ్ చేజారిపోతుందనే భయం ఉంటుంది. పంత్ ఉన్నంత సేపు సౌతాఫ్రికా బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు.
అతడిని త్వరగా అవుట్ చేయాలని భావిస్తారు. ఏ కాస్త అవకాశం దొరికినా పంత్ మ్యాచ్‌ను లాగేసుకుంటాడని వారికి తెలుసు. కానీ పంత్ ఏం చేశాడు?.. కనీసం పది బంతులు ఎదుర్కొనే వరకైననా ఆగలేకపోయాడు. అందుకు తగ్గ మూల్యం చెల్లించాడు’’ అని కుంబ్లే స్టార్ స్పోర్ట్స్ షోలో పంత్ షాట్ సెలక్షన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్


